చెవి సమస్యలపై జాగ్రత్త
మెడికవర్ హాస్పిటల్స్ ఈఎన్‌టీ సర్జన్ అలోక్
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): చెవిలో చీము కారడం, తరచూ చెవి నొప్పి రావడం, వినికిడి తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఈఎన్‌టీ సర్జన్ డా. అలోక్ ఎన్. రాఠి సూచించారు. చెవిలో చీము కారడానికి ఇన్ఫెక్షన్, మధ్య చెవి సమస్యలు, చెవిపొరలో రంధ్రం వంటి కారణాలు ఉండవచ్చన్నారు. సమస్య పదేపదే వస్తున్నా, దీర్ఘకాలంగా కొనసాగుతున్నా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాలని తెలిపారు.
వైద్యుల సలహా లేకుండా చెవిలో నూనె, డ్రాప్స్ లేదా ఇతర పదార్థాలు వేయడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే వినికిడి దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, చీము కారడం, పిలిచినా స్పందించకపోవడం లేదా టీవీ, మొబైల్ శబ్దాన్ని ఎక్కువగా పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలని డా. అలోక్ ఎన్. రాఠి సూచించారు.






