హెచ్‌జీసీఎల్ ఎండీగా ఉపేందర్‌రెడ్డి
మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్. ఉపేందర్ రెడ్డి, ఐఏఎస్ శుక్రవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటె డ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపేందర్ రెడ్డికి హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)గా తక్షణమే అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉపేందర్ రెడ్డి హెచ్‌జీసీఎల్ ఉన్నతాధికారులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థకు సంబంధించిన ప్రస్తుత కార్యకలాపాలు, ప్రాజెక్టులు, ముఖ్యమైన అంశాలను సమీక్షించిన ఆయన, హెచ్ జీసీఎల్ కు అప్పగించిన ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తొలిరోజు సమీక్షలో భాగంగా ఆయన వివిధ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి, కొనసాగుతున్న పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. హెచ్‌జీసీఎల్ లక్ష్యాలను సాధించేందుకు, మౌలిక వసతుల పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందు కు అధికారులు సమన్వయంతో, చురుకైన విధానంలో పనిచేయాలని ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు.






