22ఏ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి..
బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం
కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 22ఏ (నిషేధిత భూములు) జాబితా అక్రమాలు, అవకతవకలపై, వేలాది మంది రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులను కాలరాస్తున్న ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకొని, ఈ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో బిజెపి శ్రేణులతో కలిసి ఉన్నత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన భారీ అవకతవకలను కేవలం పరిపాలనా తప్పిదంగా కాకుండా, ఒక వ్యవస్థీకృత కుట్రగా పరిగణించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టకపోతే రైతుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామని సాయిని మల్లేశం హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, రంగు భాస్కరాచారి, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, తదితరులు పాల్గొన్నారు.






