28 లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయండి
కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ, మార్చి25:ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కేంద్రం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అలాగే 5 రైసినా రోడ్‌లోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూ డా ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 28లోగా ఆ రెండు పార్టీ కార్యాలయాలను ఖాళీ చేయాలని కేంద్రం కాంగ్రెస్ పార్టీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఢిల్లీలోని అక్బర్ రోడ్ ఆఫీస్ ఉంది. కేంద్రం నోటీసులు జారీ చేయడంతోఆ రెండు అత్యంత కీలకమైన కార్యాలయాలను ఖాళీ చేయడానికి కాంగ్రెస్‌కు గడువు సమీపిస్తోంది. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని కోట్లా మార్గ్లో ‘ఇందిరా భవన్’ పేరుతో కొత్త జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకుంది.
గత ఏడాదే సోనియా గాంధీ దీనిని ప్రారంభించారు.నిబంధనల ప్రకారం, రాజకీయ పార్టీకి సొంత భవనం సమకూరిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే అక్బర్ రోడ్‌తో ఉన్న చారిత్రక అనుబంధం వల్ల పార్టీ కార్యకలాపాలు ఇంకా అక్కడి నుంచే కొనసాగుతున్నాయి.
తాజా ప్రభుత్వ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆ పార్టీ అగ్ర నేతలు ఆరోపిస్తున్నారు. భవనాన్ని బలవంతంగా ఖాళీ చేయించకుండా నిరోధించేందుకు, మరికొంత సమయం పొందేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.




