14-02-2026 12:18:55 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ప్రేమికుల రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. ప్రేమ, ఆకర్షణ, బహుమతుల పేరుతో సామాన్యులను, ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ డిజిటల్ దోపిడీకి తెరలేపారు. వాలెంటైన్స్ సీజన్లో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
వాట్సాప్, ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా వేదికగా వచ్చే నకిలీ గిఫ్ట్ ఆఫర్లు, డేటింగ్ ప్రొఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని శిఖాగోయల్ తెలిపారు. తొలుత నకిలీ సోషల్ మీడియా లేదా డేటింగ్ ప్రొఫైల్స్‌ను సష్టించి, బాధితులతో పరిచయం పెంచుకుంటారు. కొంతకాలం చాటింగ్ చేసి నమ్మకం కుదిరాక.. అత్యవసరమని, లేదా గిఫ్ట్ పంపిస్తున్నామని, దానికి కస్టమ్స్ డ్యూటీ కట్టాలని వివిధ కారణాలతో డబ్బులు వసూలు చేస్తారు.
మరికొన్ని సందర్భాల్లో.. వాలెంటైన్స్ గిఫ్ట్లు, ఆభరణాలపై భారీ డిస్కౌంట్లు, ఫ్లవర్ డెలివరీ ఆఫర్ల పేరుతో మెసేజులు పంపిస్తారు. ఆ లింక్‌లను క్లిక్ చేయగానే నకిలీ పేమెంట్ పేజీలకు మళ్లించి లేదా ఫోన్లో మాల్వేర్ చొప్పించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, ఆన్‌లైన్ పరిచయస్తులకు డబ్బులు పంపవద్దని పోలీసులు సూచించారు.
వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే వాలెంటైన్స్ ఆఫర్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, ఇలాంటి లింక్‌ల ద్వారా వ్యక్తిగత డేటా, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. డేటింగ్ యాప్స్ లేదా సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తుల ప్రొఫైల్స్‌ను ముందే సరిచూసుకోవాలి. సోషల్ మీడియా, బ్యాంకింగ్ ఖాతాలకు తప్పనిసరిగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి.
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని టీజీసీఎస్బీ స్పష్టం చేసింది.
గత ఏడాది ప్రేమ పేరుతో రూ.12.65 కోట్లు స్వాహా
రాష్ర్టంలో సైబర్ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇటీవలి గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2025 సంవత్సరంలోనే తెలంగాణలో 384 మ్యాట్రిమోనియల్, రొమాన్స్ ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, బాధితులు ఏకంగా రూ.12.65 కోట్లు కోల్పోయా రు. ఇక ఆన్‌లైన్ సెక్టార్ల కింద 1,231 కేసులు నమోదు కాగా, రూ.3.20 కోట్ల నష్టం వాటిల్లింది. సైబర్ స్టాకిం గ్, ఆన్లైన్ వేధింపుల కేసులు 3,100 దాటాయి. 2026 ఆరంభం నుంచి కూడా ఇదే ధోరణి కొనసాగుతోందని, పండుగ సీజన్లలో ఖర్చు చేసే అలవాటును నేరగాళ్లు సొ మ్ము చేసుకుంటున్నారని అధికారులు విశ్లేషించారు.