calender_icon.png 4 July, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తమ్ముడు’తో ఆ కోరిక నెరవేరింది: వర్ష బొల్లమ్మ

03-07-2025 07:41:25 PM

‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) నిర్మాణంలో వస్తున్న మరో సూపర్‌హిట్ సినిమా ‘తమ్ముడు’.  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో సీనియర్ నటి లయ రీఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ నటి సప్తమిగౌడ రత్న అనే పాత్రలో నటిస్తుండగా మరో కథానాయిక వర్ష బొల్లమ్మ.. చిత్ర అనే పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఈ నెల 4న విడుదల కానున్న నేపథ్యంలో ‘తమ్ముడు’ విశేషాలను ఈ మూవీ జర్నీలో తన అనుభవాలను పంచుకుంది వర్ష బొల్లమ్మ(Varsha Bollamma). ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 

* నేను గతంలో ఈ ఎస్‌వీసీ సంస్థలో ‘జాను’ సినిమాలో నటించాను. ‘తమ్ముడు’ కోసం పిలవగానే ఆడిషన్ ఇచ్చాను. లుక్‌టెస్ట్‌లో వెంటనే ఓకే అయ్యాను. దర్శకుడు వేణు అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది.. మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నారు. నేను ఇదొక సవాల్‌గా భావించి.. చేస్తాను అని చెప్పాను. అలా చిత్ర పాత్రకు నేను ఎంపికయ్యాను.

* హీరో నితిన్ క్యారెక్టర్ ‘జై’కి నా పాత్ర డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది. జైకి అన్ కండిషనల్‌గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. వారి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే క్యారెక్టర్ చిత్రది. అయితే, నిజ జీవితంలో నేనలా కాదు. 

* ‘తమ్ముడు’ కథ విన్నప్పుడు ఇది కొత్తగా, ఛాలెంజింగ్‌గా ఉందనిపించింది. అందుకే నటించాను. నా క్యారెక్టర్‌కు సంబంధించి సాలిడ్ యాక్షన్ ఉంటుంది. కథలో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. తమిళంలో ‘బిగిల్’ సినిమా తర్వాత శారీరకంగా శ్రమించిన చిత్రమిదే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. రియల్ లైఫ్‌లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే కోరిక ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేశాను. 

* మూవీలో యాక్షన్ సీక్వెన్సులు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ‘తమ్ముడు’ అలాంటి సినిమా. విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. మంచి సౌండింగ్‌తో ఆకట్టుకుంటుంది.  

*  ఈ చిత్రాన్ని ఏదైనా స్టూడియోలో ఉన్న చిన్న అడవిలో కూడా షూట్ చేయొచ్చు కానీ సహజంగా ఉండేలా మారేడుమిల్లిలో చిత్రీకరించారు. అది దట్టమైన అడవి. వర్షాకాలంలో పాములు, తేళ్లు కనిపించేవి. రాత్రిపూట షూటింగ్‌లో కేవలం కాగడాలు పట్టుకుని నటించాం. షూటింగ్‌లో పెద్దవాళ్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా ఇబ్బందిపడ్డారు. లయ అమెరికా నుంచి వచ్చారు. అక్కడ సుకుమారంగా ఉండి ఈ అడవిలో చెప్పులు లేకుండా నటించారు. రోజూ ఏదో ఒక గాయం అయ్యేది. అయినా ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొనేవారు. నాకు, నితిన్ క్యారెక్టర్‌కు షూస్ ఉంటాయి. 

* లయ జర్నీ మా అందరికీ స్ఫూర్తి. హీరోయిన్‌గా ఒక కెరీర్ చూసిన ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్లడం, మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆమె కెరీర్‌లో జరిగిన విశేషాలు మాతో షేర్ చేసుకునేవారు. 

* హీరో నితిన్ చాలా కామ్‌గా ఉంటారని ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ ఆయన చాలా ఫన్ పర్సన్. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్స్ అవీ ఏమీ లేవు. మేము సరదాగా మాట్లాడుకునేవాళ్లం. చిన్నా, పెద్దా ప్రతి ఆర్టిస్టుకూ ఆయన గౌరవం ఇచ్చేవారు. నేను జోక్స్ చెప్పి ఆయనను విసిగించా. నాకు అనిపించింది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్‌ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ డైరెక్టర్ డైలాగ్‌లో ఉన్నది ఉన్నట్లు స్ట్రిక్ట్‌గా చెప్పమనేవారు. నేను ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చేసినప్పుడు స్పాంటేనియస్‌గా చాలా ఇంప్రూవ్ చేసి డైలాగ్స్ చెప్పాం. ఆ మూవీకి అలా కుదిరింది.

* నేను హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలాంటి తేడాలు చూడను. బాగా నటించాననే పేరు తెచ్చుకుంటే చాలు. నిత్యామీనన్‌ను ఉదాహరణగా తీసుకుంటే తనకు పర్‌ఫార్మర్‌గా పేరుంది. నేనూ అలాగే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. 

* ప్రస్తుతం రెండు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నా. మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. సైకో కిల్లర్ క్యారెక్టర్‌లో కనిపించాలనేది నా కోరిక. నేను సైకో కిల్లర్ ఏంటి అనుకుంటారు. కానీ మనం ఆ జానర్ మూవీస్ చూస్తే ఎవరూ ఊహించని పాత్రలే క్రైమ్స్ చేస్తుంటాయి. అలాంటి అవకాశం వస్తే నటిస్తా.