రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వసూల్ రాజాలు!
- డాక్యుమెంట్ రైటర్లదే హవా
అడిగినంత ఇస్తేనే రాతపూతలు
ప్రైవేటు వ్యక్తుల హల్‌చల్
సంగారెడ్డి, జూన్ 1౭ (విజయ క్రాంతి): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతోంది. అధికారుల పేర్లు చెప్పి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్, సదాశివపేటలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పని చేసే ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చేయి తడపనిదే ఏ పనీ జరగదన్న రీతిలో ఆఫీసుల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యం 200 నుంచి 250 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఏ రిజిస్ట్రేషన్ అయినా డాక్యుమెంట్ తప్పనిసరి.
కొందరు అడ్వకేట్ల ద్వారా అవసరమైన పత్రాలు రూపొందించుకుంటారు. మరికొందరు.. డాక్యుమెంట్ రైటర్లను, ఇంకొందరు ప్రైవేటు వ్యక్తులను సంప్రదిస్తుంటారు. అదే వారికి ఆదాయవనరు. ఎవరు వారి దగ్గరకు వెళ్లినా.. కమిషన్ల పేరిట వేలకు వేలు లాగేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ను రేట్లను సర్కిళ్లవారీగా నిర్ణయించింది. ప్లాట్, నివాస గృహం, విల్లాతో పాటు పలు రకాల ఆస్తులకు ఛార్జీలను ప్రకటించింది. .
ఆఫీసుల వద్ద అధిక వసూళ్లు!
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలతో పాటు అదనంగా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2వేలకు పైనే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో అధికారులకే ఎక్కువ వాటా ఇవ్వాలని రైటర్లు బాహాటంగానే వసూళ్లకు తెగబడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు.
ప్రైవేటు వ్యక్తులకే వత్తాసు!
ఇక కార్యాలయాల్లో ప్రజలకు సమాధానం చెప్పేవారు ఎవరూ ఉండరు. ఎవరినైనా అడిగినా బయట ఫలానా పేరుగల ఆఫీసులో వెళ్లి అడుగు అనే ఉచిత సలహాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. దీంతో చేసేదేమీలేక ప్రజలు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తూ అదనంగా డబ్బులు ముట్టజెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఏసీబీ దాడులు, రాష్ట్ర స్థాయి అధికారుల తనిఖీలు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం విచ్చలవిడిగా సాగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
దొరకడం కష్టమే..!
వసూళ్ల పర్వం మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా సాగుతుండడంతో ఉద్యోగులు అవినీతిశాఖ అధికారులకు దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆఫీసులో అడుగు పెట్టడం నుంచి తిరిగి బయటకు వచ్చేదాకా ఖర్చులన్నీ లెక్కలేసి డాక్యుమెంట్ రైటర్లు ముందుగానే వసూలు చేస్తారు. ఆ తర్వాతే డాక్యుమెంట్ రిజిస్ట్రార్ టేబుల్ మీదకు వెళ్తుంది. అటు తర్వాత స్టాంపింగ్, రిజిష్టర్‌లో సంతకాలు.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లు సాగుతున్నాయి.
ఇదంతా రైటర్ల చేతులమీదుగా సాగుతుండడంతో ఉద్యోగులు అవినీతి ఉచ్చు నుంచి తప్పించుకుంటున్నారు. చివరకు వివాహాల రిజిస్ట్రేషన్లు, ఈసీ నకలు కాపీలకు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ పత్రాలకు ఇలా ఒక్కోదానికి వసూళ్లు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులపై నిఘా పెట్టడమో లేదా? వారి ఫోన్లను ట్యాప్ చేయడమో చేస్తే గానీ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలు, రైటర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడదు.






