16-11-2025 12:00:00 AM
పరమశివుడి క్షేత్రాలు చాలా వరకూ కొండలపై, గుట్టలపై కనిపిస్తూ వుంటాయి. కానీ అందుకు భిన్నంగా అందమైన గోదావరి నది మధ్యలో ఓ ద్వీపంలా కనిపించే దీవి, అక్కడ అద్భుత దృశ్యం పురాతన కాలం నాటి ఆలయం. ఆ దృశ్యం చూడగానే అక్కడికి వెళ్లాలి అనిపించే ఆత్రుత, మనసును ఉవ్విళ్లూరిస్తుంది.
ఆ ప్రాంతమే మోతేగడ్డ. ఈ గడ్డపై పురాతన కాలం నాటి శివాలయంలో పరమేశ్వరుడు అంశావతారమైన వీరభద్రుడు గిరిజన ప్రజల అల్లుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఆ ప్రాచీన క్షేత్ర విశేషాలపై విజయక్రాంతి కథనం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం మోతెపట్టి నగర్ గ్రామంలో నిత్యం పరవళ్లు తొక్కే గోదావరి నది మధ్యలో ఈ ఆలయం చూడడానికి ద్వీపకల్పంలా ఉంటుంది.
కొండపై కొలువైయున్న వీరభద్రుణ్ని తరతరాలుగా గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం వేళలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సైతం ఈ ఆలయానికి భక్తులు వస్తారు. ఈ దీవిలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని 13వ శతాబ్ధంలో గిరిజనులే నిర్మించుకున్నారు.
ఆ దేవాలయం ఇప్పటికీ చెక్కుచెదకుండా ఉంది. సూర్య భగవానుడు ఈ క్షేత్రపాలకుడు. ఇక్కడి గుట్టపై స్వామి భద్రకాళీ సమేత వీరభద్రుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. సాధారణంగా దక్షుడి సంహారం కోసం ఆవిర్భవించిన వీరభద్రుడు ఆ తరువాత ఆయా ప్రదేశాల్లో కొలువైనట్టుగా స్థలపురాణాలు చెపుతుంటాయి. ఇక్కడ మాత్రం వీరభద్రుడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి భద్రకాళి అనే గిరిజన యువతిని వివాహం చేసుకున్నాడనే ఆసక్తికరమైన ప్రచారం వినిపిస్తూ ఉంటుంది.
గిరిజన భ్రదకాళీతో వీరభద్రడి వివాహం
గిరిజనులు కథ ప్రకారం వీరభద్రడు గిరిజన యువతి యైన భ్రదకాళిని ప్రేమించి, వారి కులపెద్దలను ఒప్పించి వివాహమాడతాడు. ఆ కొండజాతి వారికి కొండంత అం డగా ఉంటూ దేవుడులాంటి అల్లుడని పించుకుంటాడు. వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వారికి దేవుడితో సమానమవుతాడు. ఆ కృతజ్ఞతతోనే గిరిజనులు గు డి కట్టించారని నానుడి. మహాశివరాత్రి సందర్భంగా ఘ నంగా కళ్యాణోత్వం జరిపిస్తారు.
వీరభ్రదుడికి గోటి తలంబ్రాలు తెస్తారు. ఆడబిడ్డ భద్రకాళికి తాళి బొట్టు, కట్న కానుకలూ భక్తితో సమర్పిస్తారు. శివరాత్రి అర్ధరాత్రి లిం గోద్భవ సమయంలో వీరభద్ర స్వామి, అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. వీరభద్రుడిని తమ అల్లుడిగా భావించి, తమని అనేక విధాలుగా ఆదుకుంటూ వ చ్చిన ఆయనకి పూజలు చేస్తుంటారు. విశేషమైన రోజుల్లో తమ పద్ధతిని అనుసరించి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానుకలు చెల్లిస్తుంటారు. తమనందరినీ ఆయనే చల్లగా చూస్తూ ఉంటాడని బలంగా విశ్వసిస్తుంటారు.
పొర్లుదండాలు, ప్రాణాచారంతో వరాలు
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గిరిజనులంతా ఈ ఉత్సవానికి వస్తారు. సంతానంలేని మహిళలు గోదావరిలో పుణ్య స్నానం ఆచరించి ఒడి బి య్యంతో స్వామివారి ఆలయం చుట్టూ తడిబట్టలతో ప్రదక్షిణ చేసి సాష్టాంగపడతారు. స్వామి అనుగ్రహించి ధ్వాన స్థితిలో ఉన్న వారికి పండును ప్రసాదంగా ఇస్తాడని వీరి నమ్మకం.
కానీ పండు అందకుండానే దుస్తులు తడారిపోతే మరలా స్నానం చేసివచ్చి మరలా పొర్లు దండాలు పెడతారు. ఇలా చేస్తే సంతానం కలుగుతుందనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం, అన్న ప్రాసన ఇక్కడే జరిపించటం వీరి ఆనవాయితి. అంతేకాకుండా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి వేళ గోదావరి ఇసుక తిన్నెల్లో ఎదుర్కోలు ఉత్సవం కనులపండువగా కొనసాగుతుంది.
ఆరు నెలల పాటే స్వామివారికి పూజలు
ఈ ఆలయం నిత్యం తెరిచి ఉండదు. పరమపవిత్రమైన గోదావరి మధ్యలో ఎత్తున ద్వీపం వద్ద ఈ ఆలయం ఉంది. ఎంత పెద్ద వరదలు వచ్చినా ఈ దీవి నీటిలో మునగదు. కానీ జూలై నుంచి నవంబర్ వరకు గోదావరి ఉధృత ప్రవాహం కారణంగా ఎవరూ ఈ దీవికి వెళ్లరు. నవంబర్ తరువాతనే పూజాదికాలు ప్రారంభమవుతాయి. ఆ ఇసుక తిన్నెలు.. అందమైన పరిసరాలు అహ్లాదాన్ని పంచుతాయి. సంధ్యా సమయంలో గోదావరి జలాలపై సూర్యకిరణాలు ప్రతిబింబించే దృశ్యం అపూర్వం.
పడవ ఎక్కాలి, గోదావరి దాటాలి
భద్రాచలానికి వెళ్తున్నపుడు వచ్చే సారపాక కూడలి నుంచి ఇరవెండి దారిలో నాలుగు కిలోమీటర్ల దూరం తరువాత మోతే నుంచి గోదావరి తీరానికి దారి ఉంది. దాదాపు కిలోమీటరు తరువాత గోదావరి తీరంలో మొట్లరేవు కనిపిస్తుంది. అక్కడ నుంచి పడవలో మోతెగడ్డకు వెళ్లవచ్చు. లేదా భద్రాచలం పట్టణం నుంచి పర్ణశాల, దుమ్ముగూడెం వెళ్లే దారిలో నాలుగు కిలోమీటర్ల దూరంలో చెన్నంపేట అనే చిన్నగ్రామం ఉంటుంది. ఈ పల్లె నుంచి గోదావరి తీరానికి చేరుకొని అటునుంచి నదిలో మోతెగడ్డకు నడచి వెళ్లవచ్చు. కొంచెం కష్టం అనిపించినా ఈ క్షేత్రంలో స్వామి దర్శనం మధురానుభూతిని మిగుల్చుతుంది.
మారాసు సుధీర్ (మణుగూరు, విజయక్రాంతి)