12 July, 2026 | 2:53 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

వీరమల్లు వస్తున్నాడు

17-05-2025 12:07 AM

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయాలని భావించారు. మే నెలలో విడుదల చేద్దామనుకున్నా సాధ్యం కాలేదు.

ఇలా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీ కావటంతో పవన్‌కల్యాణ్ కాల్షీట్లు ఇవ్వలేదు. దీంతో ఇంతకాలంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇలా ఆలస్యాలు, వాయిదాలకు కారణమైన పవన్ ఇటీవల తనకు సంబంధించి సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడంతో మొత్తం సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం తుది మెరుగులు అద్దుకుంటోంది. థర్డ్ సింగిల్, ట్రైలర్ విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదే జోష్‌లో చిత్రబృందం తాజాగా శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జూన్ 12న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ సినిమాలో కొంత భాగాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ చేపట్టి, పూర్తిచేశారు. మొత్తం రెండు భాగాల్లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా తొలిభాగం ‘హరిహర వీరమల్లు: పార్ట్1 వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

పవన్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా నటిస్తున్నారు. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; సంగీతం: కీరవాణి; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; కళా దర్శకుడు: తోట తరణి; కూర్పు: ప్రవీణ్ కేఎల్.