calender_icon.png 20 July, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో వీరమల్లు టికెట్ ధరల పెంపు

20-07-2025 12:09:19 AM

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీర మల్లు సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతులు జారీ చేసింది. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు.

అయితే, ప్రభుత్వం 10 రోజుల వరకు అధిక ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంటే.. జూలై 24 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో లోయర్ క్లాస్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇక మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ ధరలపై జీఎస్టీ అదనంగా వసూలు చేయొద్దని, జీఎస్టీ కలుపుకొనే టికెట్ ధర నిర్ణయిం చామని సర్కార్ స్పష్టం చేసింది. విడుదలకు ముందు రోజు.. అంటే జూలై 23వ తేదీ (బుధవారం) రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమి యర్స్‌కు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఈ టికెట్ ధరపై అదనంగా మరో 18 శాతం జీఎస్టీ కూడా వర్తించనుంది. ప్రీమియర్ షోలు ఎంపిక చేసిన కేంద్రాల్లోనే వేయనున్నారు. 

తెలంగాణ సర్కారుకూ అర్జీ.. 

‘హరిహర వీరమల్లు’ చిత్ర నిర్మాత టికెట్ ధరల పెంపు విషయమై  ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సైతం దరఖాస్తు సమర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, పెయిడ్ ప్రీమియర్స్ విషయమై నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. “ఏపీలో టికెట్ రేట్లు పెంచుతున్నారు. తెలం గాణలోనూ అడిగాం. సీఎం రేవంత్‌రెడ్డి చూద్దాం అన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి, మా సినిమా కొంత భాగం చూపించాను.

చారిత్రక అంశాలతో రూపొందే సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతామని గతంలో ప్రభుత్వ పెద్దలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశాను. మా సినిమాలో నిజాం కాలం కథ ఉంది కాబట్టి టికెట్ రేట్లు పెంచాలని కోరాను. అయితే, సినిమాటోగ్రఫీ మంత్రి.. సీఎంతో మాట్లాడి చెప్తానని, ఏపీ జీవో తీసుకువస్తే దాన్నిబట్టి రేట్లు నిర్ణయిద్దామని హామీ ఇచ్చారు” అని ఏఎం రత్నం తెలిపారు.