24-12-2025 09:47:56 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో 13.77 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం కేతేపల్లి ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో కొర్లపహాడ్ టోల్‌ప్లాజా సమీపంలోని సందీప్ దాబా హోటల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సూర్యాపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరి వద్ద కాలేజ్ బ్యాగుల్లో దాచిన 13.77 కేజీల గంజాయి పట్టుబడి చేసినట్లు తెలిపారు.
దాని విలువ సుమారు రూ.3,44,250 పోలీసులు అంచనా వేశారు. అరెస్ట్ అయిన నిందితులు బిక్రం మండల్, సమరేష్ మండల్ ఒడిశా రాష్ట్రానికి చెందినవారని, జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కోరమనూర్ గ్రామానికి చెందిన భీమా మడ్కామ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించేందుకు అక్రమ రవాణా చేస్తున్న సమయంలో పట్టుబడ్డారని వివరించారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.