calender_icon.png 14 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయమా.. పరాజయమా?

14-07-2025 02:38:42 AM

రసవత్తరంగా మూడో టెస్టు

లార్డ్స్, జూలై 13: టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. చివరి రోజైన నేడు భారత్ విజయం కోసం 135 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌కు విజయం దక్కాలంటే 6 వికెట్లు కావాలి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌట్ అయింది. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ జైస్వాల్‌తో పాటు వన్ డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్, కెప్టెన్ గిల్ పెద్దగా ప్రభావం చూపకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు.

ఓపెనర్ రాహుల్ (33*) ఒక్కడే పోరాడుతున్నాడు. ఓ వైపు రాహుల్ పోరాటం కొనసాగిస్తున్నా.. అవతలి ఎండ్‌లో అతడికి సహకారం అందించే వారు కరువయ్యారు. నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్‌దీప్ (1) కూడా విఫలం అయ్యాడు. తన బాధ్యత పూర్తి చేయకుండానే రెండు బంతులు మిగిలుండగానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్‌కు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఇక నేడు చివరి రోజు కావడంతో పిచ్ ఎలా స్పందిస్తుందనేది మిస్టరీగా మారింది.

ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌట్ అయినపుడు భారత్ సులభంగా ఈ టెస్టులో విజయం సాధిస్తుందని అనిపించినా కానీ ఓవర్లు గడిచేకొద్దీ పరిస్థితులు చేజారిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇంగ్లండ్‌కు కూడా విజయావకాశాలు మెండుగానే ఉన్నాయి. మరి నేడు ఇంగ్లండ్ బౌలర్ల బౌన్సర్లను కాచుకుని భారత బ్యాటర్లు ఎంత వరకు సత్తా చాటుతారనే దానిమీదే గిల్ సేన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కార్స్ రెండు వికెట్లు తీయగా.. స్టోక్స్, ఆర్చర్ చెరో వికెట్ కూల్చారు.