calender_icon.png 29 May, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయనగరమే నా టార్గెట్

27-05-2025 01:20:19 AM

  1. హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని సూచించిన సౌదీ హ్యాండ్లర్ 
  2. ఎన్‌ఐఏ విచారణలో ఉగ్రనిందితుడు సిరాజ్ వెల్లడి

విజయనగరం, మే 26:  ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం ఉగ్రకుట్ర కేసులో నిందితులు సిరాజ్ ఉర్ రెహ్మన్, సయ్యద్ సమీర్‌ను నాలుగో రోజు సోమవారం ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఢిల్లీ నుంచి విజయ నగరం చేరుకున్న ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్‌బీ బృందాలు అక్కడే మకాం వేసి నిందితులను విచారిస్తున్నాయి.

విచారణలో పేలుళ్లకు విజయనగరమే తన మొదటి టార్గెట్ అని, అయితే హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్ తనకు సూచించారని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ప్రశాంతంగా ఉన్న విజయనగరమే తన లక్ష్యమని వాళ్లకు చెప్పినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించాడు. పేలుళ్ల కోసం సౌదీలో, పాకిస్థాన్‌లో శిక్షణ తీసు కున్నట్లు చెప్పినట్లు సమాచారం.

పేలుళ్ల కోసం విజయనగరంలో 4 ప్రాంతాల ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్‌వర్క్ ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన మొహిద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాధల్, మరో ఆరుగురు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో సిరాజ్, సమీర్ జరిపిన చాటింగ్‌పై దర్యాప్తు బృందాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

విజయనగరం సహా పలు ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్రపన్నినట్లు, ఐసిస్ లేదా ఇతర ఉగ్రసంస్థలు వారిని ప్రేరేపించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సిరాజ్ కుటుంబం, స్నేహితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం.