విజయుడు మల్లన్న
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు
రెండో స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్
సూర్యాపేట, జూన్ 07 (విజయక్రాంతి): నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ విజయం సాధించారు. ఈ నెల 5న ప్రారంభమైన ఎమ్మెల్సీ కౌంటింగ్ శుక్రవారం ముగిసింది. గత నెల 31న జరిగిన గ్రాడ్యుయేట్ ఉపఎన్నికల్లో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటయ్యాయి.
ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కించగా, ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధానత్య ఓట్ల లెక్కించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకు బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, రాకేష్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. గెలుపునకు కావాల్సిన 1,55,095 రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు.
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సహా 48 మంది ఎలిమినేట్ అయ్యారు. తీన్మార్ మల్లన్న 19,375 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డిని ఎలిమినేట్ చేయడంతో మల్లన్న విజయం ఖాయమైనది. కానీ గెలుపునకు కావాల్సిన కోటా 1,55,095 ఓట్లు పూర్తి కాలేదు. అయితే మెజార్టీలో ఉండటంతో మల్లన్న గెలిచినట్టు ధృవీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోరారు. అనుమతి రావటంతో తీన్మార్ మల్లన్న గెలిచినట్టు ప్రకటించారు.






