2 April, 2026 | 3:06 AM

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి

02-04-2026 01:02 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. గురువారం నిర్వహించబోయే గ్రామ సభలు, మున్సిపల్ వార్డుల్లో సభల నిర్వహణపై బుధవారం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీ ద్వారా సూచనలు ఇచ్చారు.

గ్రామ సభలు, మున్సిపల్ సభలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామ సభల్లో ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండున్నర సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులను చేపట్టిందని, అదేవిధంగా కొత్తగా మరికొన్ని పథకాలు చేపట్టబోతుంది.

ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వార ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు, మున్సిపాలిటీలో ఈమేరకు అభివృద్ధి పనులు జరిగాయి, ఖర్చు చేసిన నిధులు తదితర విషయాలను గ్రామ సభ సందర్భంగా ప్రజలకు వివరించాలని సూచించారు. కొత్త పథకాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో ఇచ్చిన రైతు భరోసా, రుణ మాఫీ, ధాన్యం సేకరణ, రైతులకు 500 రూపాయల బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు. లబ్ధిదారుల పేర్లు సైతం చదివి వినిపించాలని చెప్పారు. ఎవరైనా అర్జీలు ఇచ్చేవారు ఉంటే వాళ్లనుండి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు తీసుకోవాలని సూచించారు.

గ్రామ సభకు అత్యధికంగా ప్రజలు వచ్చే విధంగా చూడాలని, గ్రామ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టెంట్, షామియానా, మంచినీరు, ముఖ్యమంత్రి సందేశం చూసేందుకు టి.వి తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, సభ ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలను మినిట్ టు మినిట్ కార్యక్రమాలను వివరించారు. ఈ గూగుల్ మీట్లో అదనపు కలెక్టర్ నగేష్, డిపిఓ యాదయ్య, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.