5 June, 2026 | 2:51 AM

గ్రామసభలు విజయవంతం

05-06-2026 01:47 AM

ఎంపీడీఓ మహేశ్వరరావు

నాగల్గిద్ద, జూన్ 4: నాగల్గిద్ద మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఎంపీడీఓ మహేశ్వరరావు తెలిపారు. మొదటి రోజు నిర్వహించాల్సిన ఏడు గ్రామ సభలు విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచే నేరుగా తెలుసుకొని స్థానిక స్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు, అభ్యర్థనలు, సమస్యలను నమోదు చేసి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు.

4 ప్రత్యేక బృందాలు

గ్రామాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎంపీడీఓ వెల్లడించారు. ఈ బృందాలకు ఎంపీడీఓ మహేశ్వరరావు, తహసీల్దార్ సంగం రెడ్డి, మండల విద్యాధికారి మన్మథ కిషోర్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి నాయకత్వం వహిస్తున్నారు.

ప్రతి బృందంలో ఐదుగురు మండల స్థాయి అధికారులు సభ్యులుగా ఉండి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పాలన గ్రామ సభల ప్రధాన లక్ష్యమని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు సభల్లో పాల్గొన్నారు.