24-04-2025 12:00:00 AM
వేదకాలం నుంచే గ్రామసభల పేరుతో అభివృద్ధి పథకాల రచనలు ప్రారంభమైనాయి. ఈ స్థానిక స్వయంపాలన విధానమే నేడు చట్టరూపంలో పంచాయతీరాజ్ వ్యవస్థగా రూపాంతరం చెందింది. రాజ్యాంగ 73వ సవరణ చట్టం, 1992 ద్వారా 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చింది.
ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నేడు స్థానికుల స్వయంపాలనకు రాచబాటలు వేసింది. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఏర్పడిన ఈ వ్యవస్థ అమలు తేదీని ఆధారంగా చేసుకొని ప్రతి ఏట ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
భారత రాజ్యాంగ సవరణ రూపంలో అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్ వ్యవస్థల ద్వారా గ్రామీణాభివృద్ధి, అట్టడుగు వర్గాల సంక్షేమం, సమన్యాయం, మహిళా వికాసం, మహిళా సాధికారత, పారదర్శకత, జవాబుదారీతనం, స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణ పౌర సమాజ సాధికారత వంటి ప్రయోజనాలు కల్పించడం జరుగుతున్నది. పరిపాలన వికేంద్రీకరణ, విని యోగం, స్థానికుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, ఆర్థిక చేయూతను ఇవ్వడం వంటి బాధ్యతలు పంచాయతీరాజ్ వ్యవస్థకు అప్పగించారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేదికగా స్థానికులకు అవగాహన కల్పించడం, చర్చలు జరపడం, ఉత్తమ పథకాలు లేదా విజయ వంతమైన ప్రయోగాలకు అవార్డులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇదే వేదికగా స్థానికులు తమ పాలనను తాము చేసుకోవడం, గ్రామీణా భివృద్ధికి బాటలు వేయడం, గ్రామీణ మహిళల్ని శక్తివంతులుగా మార్చడం, పరిపాలనలో అంతర్జాల వినియోగం పెంచడం లాంటి అంశాలను వివరిస్తారు.
ఈ స్థానిక సంస్థలు బలపడితే పట్టణాలకు వలసలు తగ్గడం, వాతావరణం ప్రతికూల మార్పులను కట్టడి చేయడం, సమ్మిళిత గ్రామీణ సమగ్రాభివృద్ధికి బాటలు పడడం జరుగుతుంది. అప్పుడే అసలైన బృహత్ లక్ష్యాలు నెరవేరుతాయి.
డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి