12-09-2025 01:16:56 AM
-మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): విరాట్ నగర్ కాలనీ, బసవతారక నగర్ బస్తీలలో ఏళ్ల తరబడి నెలకొన్న ముంపు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో ఈ రెండు ప్రాంతాలు జలమయం అవుతుండగా, ఈ సమస్యను సమూలంగా పరిష్కరిం చేందుకు చేపట్టిన పనులను మేయర్ పరిశీలించారు.
గురువారం సాయంత్రం షేక్పేట డివిజన్లోని విరాట్ నగర్ కాలనీలో జరుగుతున్న స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించా రు. వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల నుండి వచ్చే భారీ వర్షపు వరదతో విరాట్ నగర్ కాలనీ, బసవతారక నగ ర్లు తీవ్రంగా ముంపుకు గురవుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎం సీ స్టార్మ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్లను నిర్మిస్తోంది.
ఈ డ్రైన్ల నిర్మాణం పూర్తయితే విరా ట్ నగర్, బసవతారక నగర్లే కాకుండా సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు కూడా వరద ముంపు నుండి శాశ్వత విముక్తి లభిస్తుందని మేయర్ తెలిపారు. జరుగుతున్న స్టార్మ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ ఫరాజ్, డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య, ఈఈ విజయ్ తదితర అధికారులు పాల్గొన్నారు.