6 August, 2026 | 2:32 AM

మోహన్‌లాల్ కూతురు అనిపించుకుంటా!

06-08-2026 12:00 AM

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూతురు విస్మయ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రచయిత్రిగా గుర్తింపు పొందిన విస్మయ.. ఇప్పుడు ‘తుడక్కం’ అనే సినిమాతో కథానాయికగా పరిచయమవుతోంది. జూడ్ ఆంథని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలకు థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ రూపొందించిన ఈ చిత్రంపై మలయాళ చిత్రసీమలో ఆసక్తి నెలకొంది.

ఆశిష్ జో ఆంటోనీతో పాటు గణేశ్‌కుమార్, సాయికుమార్, జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాత, జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో విస్మయ నటనతోపాటు యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తన తొలి చిత్రంపై విస్మయ స్పందిస్తూ, ‘మోహన్‌లాల్ కూతురుగా ఆయన పేరు నిలబెడతాన’ని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మోహన్‌లాల్ కుమార్తె అనే కారణంగా తనపై ఎక్కువ అంచనాలు ఉండటం సహజమేనని, అయితే విమర్శలకు భయపడకుండా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది.