17 June, 2026 | 3:35 AM

వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు..

17-06-2026 02:36 AM
  1. వర్షం కోసం గజ్జల దేవుడికి ఆదివాసీల ప్రత్యేక పూజలు
  2. విస్తారంగా వర్షం మిరియాలని కప్పతల్లి ఆట

ఆదిలాబాద్/ఉట్నూర్/బేల, జూన్ 16 (విజయక్రాంతి) : ఖరీఫ్ సాగు పనులు మొదలైన తొలకరి పులకరింపు లేక అటు అన్నదాతలు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన కాలం ప్రారంభమైన నేటికి వర్షాలు కురియకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వరుణ దేవుడి కరుణ కోసం వివిధ పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు గ్రామానికి దూరంగా అడవి ప్రాంతంలోకి వెళ్లి గజ్జల దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ.. వర్షాలు కురవాలని.. పంటలు బాగా పండాలని దేవుడిని మొక్కులు చెల్లించుకుంటు న్నారు.

ఖరీఫ్ సీజన్ సందర్భంగా పంట చేనులో విత్తనాలను విత్తుకునేందుకు ముం దుగాగజ్జల దేవుడు.. వరుణ దేవుడికి పూజలు చేయడం అనవాయితీగా వస్తుంది. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అడవి ప్రాంతంలో కొలువుదీరిన గజ్జల దేవుడికి.. వాన దేవుడికి ఆదివా సీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా వండిన నైవేద్యంను మోదుగు ఆకుల లో దేవతలకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో లచ్చు పటేల్, కినక జూగాదిరావు తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

బేల లో కప్పతల్లి ఆట

వర్షాలు కురియాలని కోరుకుంటూ బేల మండల కేంద్రంలో డీలర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట ఆడారు. ముందుగా స్థానిక సబ్ మా ర్కెట్ యార్డు లోని గణేష్ మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ యువత వర్షాలు కురియాలని కోటి ఆశతో కప్పతల్లి ఆట ఆడారు.

కప్పను ఓ సంచిలో ఉంచి రోకలికి మధ్యలో కట్టి గ్రామ పురవీధుల్లో డప్పుచప్పులతో ఊరేగించారు. దింతో ప్రజలు, వ్యాపార వర్గాలు కప్పతో, రోకలినీ భుజాలపై మోసుకెళ్లిన వారికి జలాభిషేకం చేస్తూ వరుణుడు కరుణించాలని, సంప్రదాయ పూజలు నిర్వహించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కప్పతల్లి ఆట ఆడారు.