17 June, 2026 | 3:37 AM

చిన్న జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణం

17-06-2026 02:37 AM

సీపీ రష్మీ పెరుమాళ్ 

జక్కాపూర్ లో సీసీ కెమెరాల ప్రారంభం 

డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు సూచన 

సిద్దిపేట క్రైం, జూన్ 16: వాహనదారులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. మన పోలీస్ - మన ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు.

’సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. చిన్నకోడూరు పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల గోడలపై గీసిన ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన చిత్రాలను సీపీ పరిశీలించారు. చిత్రాలు వేసిన పోలీసు కానిస్టేబుల్ పర్శరాములును అభినందించారు. అనంతరం మహిళలకు ట్రాఫిక్, డ్రగ్స్, సైబర్ క్రైమ్ అవగాహన థీమ్ రంగుల రంగోలి (ముగ్గుల) పోటీలను ఆమె ఆసక్తిగా తిలకించారు.

గ్రామస్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వృద్ధులకు, అర్హులకు ఉచితంగా కళ్లద్దాలు, చేతి కర్రలు, మోకాళ్ల క్యాప్లను ఆమె అందజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు. గ్రామ యువతకు, పోలీస్ టీమ్కు మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్కు సీపీ టాస్ వేసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీ మాట్లాడుతూ, యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.

తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్కు బానిసలైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వారికి ఉచితంగా డి-అడిక్షన్ చేయించి, సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.  వేదికపై ప్రజలకు అవగాహన కల్పించేలా ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్ మహమ్మారిపై లఘు చిత్రాలు ప్రదర్శించారు.

స్థానిక విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, సామాజిక అవగాహన ప్రదర్శన, గ్రామ యువత రూపొందించిన డ్రగ్స్ అవేర్నెస్ షార్ట్ ఫిలిం ఆకట్టుకున్నాయి. సభ అనంతరం సీపీ రష్మి పెరుమాళ్ నేరుగా గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు, తోటి పోలీస్ అధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీపీ వెంట అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్, సీఐ విద్యాసాగర్, చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్, సిబ్బంది ఉన్నారు.