27 August, 2026 | 2:47 AM

రాహుల్ X కంగనా

27-08-2026 01:36 AM
  1. వాణిజ్య ప్రకటనలో నటి కృతి వస్త్రధారణపై దుమారం
  2. రాఖీ పండుగ యాడ్‌లో అలాంటి వస్త్రధారణేంటి? : బీజేపీ ఎంపీ కంగనా
  3. కృతి దుస్తుల ఎంపిక శోచనీయమంటూ వ్యాఖ్యలు 
  4. కంగనా పోస్టుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ అభ్యంతరం 
  5. దుస్తుల ఎంపిక మహిళల వ్యక్తిగత చాయిస్ అంటూ కౌంటర్
  6. రాహుల్ వ్యాఖ్యలపై కంగనా రీ కౌంటర్
  7. మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్ వైఖరిని పునఃసమీక్షించుకోవాలని హితవు

న్యూఢిల్లీ, ఆగస్టు 26: బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా నటించిన ఓ ఆభరణాల వాణిజ్య ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవవారం విడుదలైన ఈ ప్రకటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రకటనలో కృతి సనన్ వస్త్రధారణపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనలో ఆమె వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉందంటూ సోషల్‌మీడియా ద్వారా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ అంశం రాజకీయపరంగానూ దుమారం రేపింది. కృతి వస్త్రధారణపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌(BJP MP Kangana Ranaut)కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ(AICC leader Rahul Gandhi) మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నది. కంగనా ‘బ్రో కాస్త ఆగు’ అంటూ రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తానికి ఇప్పుడీ అంశం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధంగా మారింది. ఇంతకీ ఎంపీ కంగనా రనౌత్ ఏమని స్పందించారంటే.. ‘సంప్రదాయ పండుగ రాఖీకి సంబంధించిన ప్రకటనలో అభ్యంతర దుస్తులతో నటించడం బాధాకరమని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

‘నటి కృతి సనన్ నటించిన ఆభరణాల వాణిజ్య ప్రకటనలో ఆమె వస్త్రధారణ అభ్యంతరకరం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా ప్రకటన చిత్రీకరణ జరిగింది. అయితే.. ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులు విచిత్రంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. రాఖీ పండుగకు సంప్రదాయాలకు అద్దం పట్టే ఎన్నో రకాల దుస్తులు ఎంపిక చేసుకోవచ్చు. కానీ.. కృతి మాత్రం అందుకు భిన్నంగా అభ్యంతర దుస్తులు ఎంచుకోవడం బాధాకరం’ అంటూ రాసుకొచ్చారు.

ఎంపీ కంగనాకు నటి కృతి కౌంటర్

ఎంపీ కంగనా రనౌత్ పోస్టుపై నటి కృతి సనన్ కౌంటర్ ఇచ్చారు. వస్త్రధారణ, సంప్రదాయాలు వేర్వేరు అంశాలని, దయచేసి వస్త్రధారణ అంశాన్ని సంప్రదాయాలకు ముడిపెట్టవద్దని సూచించారు. మహిళల వస్త్రధారణను బట్టి వారి గౌరవాన్ని అంచనా వేయవద్దని హితవు పలికారు.

ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించే స్వేచ్ఛ ఉంటుందని రాసుకొచ్చారు. రక్షాబంధన్ పండుగ అర్థం భావోద్వేగాలతో కూడుకున్నదే, కానీ దుస్తులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, కృతి సనన్‌కు మద్దతుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలిచారు. మహిళల వస్త్రధారణ అనేది వారి వ్యక్తిగత ఎంపిక అంటూ వ్యాఖ్యానించారు.

దుస్తులు మహిళల వ్యక్తిగత ఎంపిక: రాహుల్

వాణిజ్య ప్రకటనలో నటి కృతి సనన్ వస్త్రధారణపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కృతి సనన్‌కు మద్దతు ప్రకటించారు. ‘మహిళలు ఏ తరహా దుస్తులు ధరించాలి.. ఎక్కడికి వెళ్లాలనేది వారి సొంత ఎంపిక. కేవలం వస్త్రధారణ ఆధారంగా మహిళలను ట్రోల్ చేయడం సరికాదు. అలా ట్రోల్ చేయడం పితృస్వామ్య భావజాలంలో భాగమే. పితృస్వామ్యాన్ని కూల్చివేయాల్సిందే. మహిళలెవరికీ బానిసలు కాదు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రతిఒక్కరూ గౌరవించి తీరాలి’ అని సూచించారు. 

రాహుల్‌కు కంగనా రీకౌంటర్

రాహుల్ వ్యాఖ్యలపై బుధవారం ఎంపీ కంగనా స్పందిస్తూ.. ‘బ్రో.. కాస్త ఆగు’ అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పితృస్వామ్యాన్ని కూల్చేస్తామని రాహుల్ గళమెత్తే ముందు మహిళా సాధికారత విషయంలో ఒకసారి కాంగ్రెస్ వైఖరిని పునః సమీక్షించుకోవాలని హితవు పలికారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. కర్ణాటక మంత్రివర్గంలో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఎత్తిచూపారు.