27 August, 2026 | 4:42 AM

భూభారతి మంత్రులకు వజ్రాల హారతి

27-08-2026 01:31 AM
  1. నిషేధిత భూమిపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి
  2. ఇందులో ఎవరి కుట్ర ఉందో సీఎం చెప్పాలి
  3. ప్రతినెలా రాహుల్‌కు రూ.200 కోట్ల ముడుపులు
  4. అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి
  5. మంత్రి పొంగులేటి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి
  6. భూభారతి అవకతవకలపై రాహుల్ గాంధీకి లేఖ
  7. 5, 6 తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు
  8. ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడి 
  9. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): భూభారతి మంత్రులకు వజ్రాల హారతిగా మారిందని, నిషేధిత జాబితాలోని భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(BJP Leader Alleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. ఇందులో ఎవరి కుట్ర ఉందో సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టాలన్నారు. సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణకు ఎందుకు కోరడంలేదని ప్రశ్నించారు.

మంత్రి పొంగులేటి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూభారతి అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపడుతామని, సర్కారు స్పందించకుంటే 7న అసెంబ్లీ ముట్టడి చేపడతామని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత భూముల జాబితా(22ఏ)ను అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న భూ బదిలీలు, చీక టి ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

షెల్ కంపెనీలకు రూ.15 వేల కోట్లు

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన బినామీ, షెల్ కంపెనీలకు సుమారు రూ.15 వేల కోట్ల ఆస్తులు అక్రమంగా బదిలీ అయ్యాయని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉంటూ సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చుకోవడం దారుణమన్నారు.

గత ప్రభుత్వంలో ‘ధరణి’ పేరుతో జరిగిన దోపిడీని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, నేడు అదే విధానాన్ని ‘భూ భారతి’ పేరుతో మంత్రులకు వజ్రాల హారతిగా మలుచుకున్నారని విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రతి నెలా రూ.200 కోట్లు ఢిల్లీలోని రాహుల్ గాంధీకి ముడుపులుగా వెళ్తున్నాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్షలు

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, భూములను నిషేధిత జాబితాలో చేర్చబడిన బాధితులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. 

రాహుల్ గాంధీకి లేఖ

రాహుల్ గాంధీకి 22ఏ భూములపై లేఖ రాసినట్లు 22ఏ భూముల సంక్షోభంపై తక్షణమే జోక్యం చేసుకుని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్ నుంచి తొలగించా లని పేర్కొన్నట్లు ఏలేటి తెలిపారు.