వరంగల్ చపాట మిర్చికి అరుదైన గుర్తింపు
జియో గ్రాఫిక్ ఇండికేషన్ ట్యాగ్‌కు ఆమోదం
జనగామ, డిసెంబర్ 7(విజయక్రాంతి): మిర్చి రకాల్లోనే రారాజైన చపాట మిరపకాయలకు అరుదైన గుర్తింపు లభించింది. చిన్నసైజులో టమాటను పోలి ఉండే ఈ మిర్చిని కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పండిస్తారు. క్వింటాకు లక్షల్లో ఖరీదు చేసే ఈ మిర్చీ జాతీయ ఖ్యాతిని పొందింది. ఎర్ర ని రంగులో పొట్టిగా టమాటాలా కనిపించే ఈ మిరపకాయ తాజాగా జియోగ్రాఫిక్ ఇండికేషన్ ట్యాగ్‌ను సాధించింది.
రెండేళ్ల క్రితం ఓ కంపెనీ జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయగా ఇండియన్ పేటెంట్ కార్యాలయం తాజాగా దానికి ఆమోద ముద్ర వేసింది. జియోగ్రాఫిక్ ఇండికేషన్ జర్నల్‌లోనూ చపాట మిర్చికి సంబంధించిన వివరాలు నమోదయ్యాయి. రెండేళ్ల క్రితం ఈ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలికినట్లు రైతులు చెబుతున్నారు. ఎక్కువ కారం లేకుండా కొంచెం తీపిగా ఉండడం ఈ మిర్చి ప్రత్యేకత.




