వరంగల్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసిన కేంద్ర ప్రభుత్వం...
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ ల అభివృద్ధి విషయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక చొరవ ఫలించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 25.41 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ మే 22 వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొనే ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కు ప్రత్యేక ఆహ్వానం అందింది. పలు విడతల వినతి పత్రాలు సమర్పించి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల చూపెడుతున్న ప్రత్యేక చొరవకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అమృత్ భారత్ పనులకు అవరోధాలు ఏర్పడతాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఎంపీ తన చొరవతో తెరదించింది. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్ అత్యాధునిక వసతులతో పునఃప్రారంభానికి సిద్ధమైందని ఎంపీ తెలియజేసారు. కాకతీయుల కళావైభవాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మాణం ఉందన్నారు. ఎలివేషన్, విశాలమైన ఫుటవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, వెయిటింగ్ హాల్స్ లాంటి అత్యాధునిక వసతులతో ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అమృత్ భారత్ రైల్వేస్టేషన్ స్కీమ్ భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్ పనులు 40 శాతం పూర్తయ్యాయని వివరించారు. మిగతా పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని మరో సారి కలసి కోరనున్నట్లు వెల్లడించారు. విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక చొరవతో త్వరితగతిన పూర్తయినందుకు వరంగల్ ప్రజలు ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.






