సీఎంపై మల్లయ్య అనుచిత వ్యాఖ్యలకు ఖండన దిష్టిబొమ్మ దహనం
అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
కోదాడ జూలై 15,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కోదాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి బొల్లం మల్లయ్య యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత దూషణలు,
అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని నాయకులు పేర్కొన్నారు. ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు చౌకబారు రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాద్ప చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీఏఎసీస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, నలజాల శ్రీనివాసరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొత్తా గుర్వయ్య, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






