2 July, 2026 | 2:32 AM

ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా

01-06-2024 12:05 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా అవకాశం రావడాన్ని తొలుత నమ్మలేకపోయానని వెటరన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్‌కమల్ పేర్కొన్నాడు. గత ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నీరచ్ చోప్రాను కాదని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఫ్ల్లాగ్ బేరర్‌గా తనకు అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు. ‘ఒలింపిక్స్‌తో మన దేశం తరపున నేను ఫ్లాగ్ బేరర్ అని తెలియగానే మొదట ఆశ్చర్యపోయా. ఇంతకముందు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతాకాధారిగా అవకాశమొచ్చింది. కానీ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు కూడా నేను ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుండడం నమ్మలేకపోతున్నా.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన నీరజ్ చోప్రా సహా మిగిలిన అథ్లెట్లలో ఎవరికైనా అవకాశం వస్తుందేమో అనుకున్నా. కానీ ఐవోఏ అనుభవానికి ప్రాధాన్యతను ఇస్తూ ఫ్లాగ్ బేరర్‌గా అవకాశమిచ్చింది. ఐదుసార్లు ఒలింపియన్ అయిన నాకు ఈ అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. తొలిసారి టేబుల్ టెన్నిస్‌లో పురుషుల, మహిళల జట్లు విశ్వక్రీడలకు అర్హత సాధించాయి. ఈసారి టేబుల్ టెన్నిస్‌లో దేశానికి పతకాలు వచ్చే అవకాశముంది. గత నాలుగేళ్లలో మా ప్రదర్శన మరింత మెరుగైంది’ అని శరత్ కమల్ వెల్లడించాడు.