పారాహుషార్..!
- నకిలీ విత్తనాల రంగ ప్రవేశం
- అప్రమప్తతే అన్నదాతకు రక్ష
- విత్తనాల ఎంపిక కీలకం
మహబూబాబాద్, మే 31 (విజయక్రాంతి): ఏటేటా నకిలీ విత్తనాల విక్రయాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ప్రతి సీజన్లో అన్నదాతలు అధిక దిగుబడుల ఆశతో విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలు పెరుగుతుండటం రైతాంగానికి తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. అసలైన విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు. నకిలీ విత్తనా లు విత్తిన పొలాల్లో మొలక శాతం తక్కువగా ఉండటం, మొక్కలు బలహీనంగా ఎదగడం, తెగుళ్లు అధికంగా సోకడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు పూర్తిగా పంట నష్టపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.
దీంతో ఆశించిన దిగుబడి రాక, రెక్కల కష్టం తో పాటు పెట్టుబడి కోల్పోయి, ఆర్థికంగా దెబ్బతిని రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి గిరిజన ప్రాంతాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేస్తున్న కొందరు, ఇంకొందరు నమ్మకంతో నకిలీ విత్తనాలను అంటగట్టి మోసగిస్తున్నారనే విమర్శలు వ స్తున్నాయి. మార్కెట్లో నిషేధించిన కొన్ని రకాల విత్తనాలను రహస్యంగా విక్రయించడం, ఎలాంటి ప్యాకింగ్ లేకుండా విత్తనా లను విక్రయించడం, బ్రాండెడ్ కంపెనీల పే రుతో లూజ్ విత్తనాలను విక్రయించడం లాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.
తక్కువ ధరకు లభిస్తున్నాయన్న ఆశతో అన్నదాతలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ఏటేటా ఇలాం టి మోసాలు బహిర్గతం అవుతున్నప్పటికీ, షరా మామూలే అన్న చందంగా మారుతున్నాయి. నకిలీ విత్తనాల సంఘటనలు వెలు గు చూస్తున్నప్పటికీ, అధికారులు వాటిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, మళ్లీ వ్యవసాయ సీజన్ ప్రారంభంలో నకిలీ విత్తనాల విగ్రహాలు యదేచ్చగా సాగుతుండడం గమనార్హం.
బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన విత్తనాల ధర తో పోల్చితే, తక్కువ ధరకు, తమ ఇంటికి తె చ్చి ఇస్తుండడంతో పాటు విత్తనాలకు తాము గ్యారెంటీ అంటూ కొందరు నమ్మకంగా చెప్పి రైతులకు నకిలీ విత్తనాలను అంట కడుతున్నారనే వస్తున్నాయి. తీరా వాటిని నాటిన తర్వాత పంట ఎదుగుదల సరిగా లేకపోవడం, కొన్నిచోట్ల పంట ఎదిగినప్పటికీ ఆశిం చిన దిగుబడి రాకపోవడం, అలాగే చీడపీడ ల బెడద తట్టుకోలేకపోవడం లాంటి సంఘటనలతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి న రైతులు తర్వాత నష్టపోతున్నారు.
నకిలీ విత్తనాలతో పారాహుషార్
మహబూబాబాద్ జిల్లాలోకి నకిలీ విత్తనాలను విక్రయించే వ్యక్తులు తమ కార్యక లాపాలను చాప కింద నీరులా నిర్వహిస్తున్నారు. వానకాలం పంటలు సాగుకు అన్న దాతలు సన్నద్ధమవుతున్న వేళ నకిలీ విత్తనాలు విక్రయించే వారు కూడా తమ కార్యక లాపాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో సంచరిస్తూ, అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు రోజుల క్రితం తొర్రూర్ లో 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో మహ బూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తన విక్రయా ల గుట్టు బయటపడింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పలుచోట్ల బ్రాండెడ్ ముసుగులో, బల్క్ ప్యాకింగ్ పేరుతో విత్తనాలను తెచ్చి విడిగా విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి తోడు కొన్ని నిషేధిత ర కాలకు చెందిన పత్తి విత్తనాలు రహస్యంగా విక్రయిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల ప్యాక్పె కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, ధృవీకరణ వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. ధృవీకరించిన కంపెనీల విత్తనాలనే కొనుగోలు చేయాలి. విత్తన ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి. బిల్లు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయకూడదు.
మొలక శాతం లేదా నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా ఇతర రైతులను కూడా అప్రమత్తం చేయాలి. ‘నకిలీ విత్తనాలపై రైతుల అప్రమత్తతే పంటల రక్షణకు మొదటి అడుగు’ అని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా మాత్రమే అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడగలరని పేర్కొంటున్నారు. కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లు తీసుకుని వంటకాలం పూర్తయ్యేంతవరకు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. అనుమానాస్పద విత్తనాల విక్రయాలపై రైతులు వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి.
సరిత, జిల్లా వ్యవసాయ అధికారి మహబూబాబాద్






