calender_icon.png 25 December, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట జాగ్రత్త!

23-12-2025 12:00:00 AM

దేశంలోనే తొలిసారిగా విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ‘ది హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’ ను కర్ణాటక అసెంబ్లీ గత గురువారం ఆమోదించింది. కులం, మతం, లిం గం, జన్మస్థలం వంటి అంశాలపై ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రజా జీవితంలో ఉన్నవారు లేదా మరణించిన వారిపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు, సంజ్ఞలు, రాతలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చేసే ప్రకటనలు ద్వేషపూరితం కిందకు వస్తాయి.

విద్వేష ప్రసంగాలు, నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా వి ధించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటకలో మతపరమైన హత్య అనంతరం మత ఘర్షణలు చెలరేగాయి. దీంతో ‘విద్వేష పూరిత ప్రసంగ వ్యతిరేక చట్టాన్ని’ తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత నిబంధనలున్నాయి. కానీ ఈ ప్రసంగాలను అదుపు చేసేందుకు నిబంధనలు పెద్దగా ఉపయోగపడడం లేదు.

ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం హర్షనీయం. గతంలో మన దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలు ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నా యి. సామాజిక మాధ్యమాల పరిధి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారుతున్నాయి. ద్వేషపూరి త ప్రసంగాల ప్రభావంతో కన్నడ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేషన్‌ను దండుగులు పొట్టనబెట్టుకోవడమే దీనికి ఉదాహరణ.

భావప్రకటనా స్వేచ్ఛా ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయడం ఉన్మాదం కిందకు వస్తుంది. కేవలం ప్రసంగాలే కాదు, సమాజానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు సహా ఇతర విషయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టి తో చేసే ప్రసంగాలకూ ఈ బిల్లు నుంచి మినహాయింపు. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేలా బిల్లును రూపొందించారు.

అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు అవకాశముండడంతో పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అందువల్ల ఈ చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఉంది. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలున్నాయి. హిందూ మతసంస్థల అణచివే తకే ఈ చట్టం తీసుకొస్తున్నారని బీజేపీ విమర్శించింది. బిల్లులోని కొన్ని అంశాలపై పౌర సంఘాలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి.

వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఇటీవలే హైదరాబాద్‌లోని క్రిస్మస్ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగ వ్యతిరేక బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పడం ముదావహం. అంతిమంగా దుర్వినియోగానికి ఆస్కారం లేని చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది.