23-12-2025 12:00:00 AM
నేడు పీవీ నరసింహరావు వర్ధంతి :
రాజనీతిజ్ఞుడిగా, బహుభాషకోవిదులుగా, న్యాయవాదిగా, దౌత్యవేత్తగా, రచయితగా భిన్న పార్శ్వాలను ప్రదర్శించగల అపర చాణక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహరావు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందిన పీవీ బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. వివిధ భాషలపై పట్టు ఉండటం వల్ల వలసవాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడంలోనూ విజయం సాధించారు. ఆయన ప్రధాని, ముఖ్యమంత్రిగానే కాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఎన్నో పదవులను చేపట్టారు.
రచయితగా తన ముద్రను చూపెట్టిన పీవీ కలం నుంచి జాలువారిన లోపలి మనిషి , వేయి పడగలు, గొల్ల రామవ్వ కథ, నీలి రంగు పట్టుచీర, మంగయ్య జీవితం లాంటి రచనలు అప్పటి సామాజిక జీవనానికి అద్దం పట్టాయి. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా.. అవసరానికి మంచి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయణ్ని 17 భాషలు తెలిసిన మౌనమునిగా పేర్కొంటారు. అంతేకాదు పీవీ నర్సింహారావు భారత స్వతంత్ర ఉద్యమంతో పాటు హైదరాబాద్ విముక్తి ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు.
పీవీ తన సన్నిహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను స్థాపించారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలు దివాలా స్థాయికి చేరుకుని ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఆ సమయంలో పీవీ తన శక్తియుక్తులు, రాజకీయ చతురతతో అనేక ఆర్థిక సంస్కరణలకు చర్యలు తీసుకున్నారు. అప్పటి ఆర్ధికమంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ప్రధాని పీవీ.. సరళీకృత ఆర్ధిక విధానం ప్రవేశపెట్టి, ఆర్ధిక వ్యవస్థను గాడిన పడేసి పునరుజ్జీవం కల్పించారు.
ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం , స్థానిక వ్యాపారాలను క్రమబద్ధీకరించడం, మూలధన మార్కెట్ ను సంస్కరించడం, దేశం ద్రవ్యలోటు తగ్గించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. విచ్చిన్నమైన ఆర్ధిక వ్యవస్థను ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో ఆర్థిక సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణతో పాటు ఎల్పీజీ విధానాల్లో అనుసరించిన తీరు అభినందనీయం. ఇవాళ ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వృద్ధి చెందడానికి నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణం.
అందుకే ఆయన్ను ఆర్ధిక సంస్కరణల పితామహుడిగా అభివర్ణిస్తారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అణచివేసిన ఘనత పీవీకే దక్కుతుంది. 1998లో వాజ్ పేయ్ ప్రభుత్వం నిర్వహించిన అణుపరీక్షలు కార్యక్రమాలను మొదటగా మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. పీవీ పై గౌరవంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకంగా కేంద్ర మానవ వనరుల శాఖను ప్రత్యేకంగా ఆయన కోసమే ఏర్పాటు చేసి దానికి కేంద్ర మంత్రిగా పీవీ ని నియమించడం విశేషం.
తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పీవీ ప్రజల కోసం వినియోగించారు. తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు కలిగి ఉండటం.. చైనా, ఇరాన్ లతో సంబంధాలు పెంచుకోవడం లాంటివి ఆయన సాధించిన విజయాలకు చిహ్నం.
సిలివేరు అశోక్, 7780681801.