10 August, 2026 | 2:55 AM

జూరాల గేట్లు బంద్.. కృష్ణమ్మ జల సవ్వడులకు బ్రేక్!

10-08-2026 01:36 AM

నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటి విడుదల నిలిపివేత 

ఆదివారం సందర్శకులకు నిరాశ.. వెలవెలబోయిన జూరాల పరిసరాలు 

వనపర్తి ఆగస్టు 9 (విజయక్రాంతి): కొద్ది రోజులుగా కృష్ణమ్మ వరద జలాలతో సందడిగా కనిపించిన జూరాల ప్రాజెక్టు వద్ద ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. మరోవైపు నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల కూడా నిలిచిపోవడంతో జూరాల పరిసరాల్లో వినిపించిన కృష్ణమ్మ జల సవ్వడులు ఆగిపోయాయి.ఇటీవల భారీ వరదలతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఈ ప్రాంతం జల సందడితో కళకళలాడింది.

ప్రాజెక్టు గేట్ల నుంచి ఉరకలెత్తిన వరద నీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జలపాతాన్ని తలపించేలా ప్రవహించిన కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆసక్తి చూపారు. అయితే ఆదివారం గేట్లు మూసివేయడంతో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గేట్ల నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో జూరాల ప్రాజెక్టు వద్ద గత కొన్ని రోజులుగా కనిపించిన సందడి తగ్గు ముఖం పట్టింది ముఖ్యంగా ఆదివారం సెలవు రోజు కావడంతో జూరాలను సందర్శించేందుకు వస్తున్న ప్రకృతి ప్రేమికులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది.

మళ్లీ ఎప్పుడు గేట్లు తెరుచుకుంటాయో? 

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి వరద ప్రవాహం పెరిగితేనే జూరాల గేట్లు మళ్లీ తెరుచుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు జూరాల జల సందడి కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం వరకు వేలాది క్యూసెక్కుల నీటితో ఉరుకులు పరుగులు పెట్టిన కృష్ణమ్మ.. ఇప్పుడు నెమ్మదిగా సాగుతుండటంతో జూరాల పరిసరాలు ప్రశాంతంగా మారాయి. ఆదివారం జల సౌందర్యాన్ని ఆస్వాదించాలని వచ్చిన ప్రకృతి ప్రేమికులకు మాత్రం గేట్లు బంద్...జల సందడి క్లోజ్ అనే నిరాశే మిగిలింది.