19 May, 2026 | 7:33 AM

చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేస్తున్నాం

19-05-2026 12:00 AM
  1. ఉనికి కోసమే ప్రత్యర్థుల విమర్శలు
  2. వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

స్టేషన్ ఘనాపూర్, (మహబూబాబాద్) మే 18, (విజయక్రాంతి): నిజాయితీగా పని చేయడం, పేద ప్రజలకు న్యాయం చేయడం మాత్రమే తమకు  తెలుసని, నియోజకవర్గంలో ఒక విప్లవత్మకమైన ప్రయత్నం చేయ బోతున్నామని, గుడిసెలు, రేకులు, టార్పాలిన్ ఇళ్లలో ఉండే పేద ప్రజలందరికి రాజ కీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఇందు కోసం గ్రామాల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించి లబ్ధిదారుల గుర్తింపు చేపడతామని, ప్రభుత్వ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాము ప్రజా ప్రతినిధులుగా ఉన్నన్ని రోజులు నియోజక వర్గంలో అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం, నారాయణగిరి గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవనికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ముప్పారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు, నారాయణగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, 45 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం ముప్పారంలో 64, నారాయణగిరి 40, సోమదేవరపల్లి 4 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ముప్పారం గ్రామంలో గౌడ, కురుమ కమ్యూనిటీ హల్లు, నారాయణగిరి గ్రామంలో ముదిరాజ్, మహిళా కమ్యూనిటీ హళ్ల మంజూరు పత్రాలను పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ 32ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. తన వారసురాలిగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా అంతే నిజాయితీగా పని చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా రంగానికి పెద్ద పీట వేస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఒక్కో నియోజకవర్గంలో 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఐకేపీ సెంటర్లు, ఆర్టీసీ వంటి రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణుక, ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక, హౌసింగ్ పీడీ సిధార్థ్ నాయక్, పిఆర్ ఈఈ సైదులు రెడ్డి, పిఆర్ డిఈ శ్రీనివాస్, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.