21 August, 2026 | 8:47 AM

ఎక్కువ ధాన్యమే కొన్నాం

23-05-2024 04:08 AM

గత కంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికం

తరుగు, తాలు పేరుతో చేసే మిల్లర్ల దోపిడికి అడ్డుకట్ట వేశాం

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): గత ప్రభుత్వంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఐకేపీ సెంటర్ల ద్వారా గత ఏడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామని తెలిపారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని, గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కిలోల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిల్లర్ల దోపిడీపై ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి పలకడంతో ప్రతి క్వింటాల్‌పై రైతులకు రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా లబ్ధి చేకూరిందని తెలిపారు. 5 రోజుల్లోనే రైతుల ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని, గతంలో 45 రోజల సమయం పట్టేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన లేదని, ఉంటే కనీసం పంట నష్టపరిహారం మాత్రమే వచ్చేదని, అయినప్పటికీ తమ ప్రభుత్వం బీమా లేకున్న పరిహారం అందించినట్లు తెలిపారు. ఇక ముందు రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంట బీమా పథకానికి రూ.3వేల కోట్లు వెచ్చించి వానకాలం నుంచి అమలు చేస్తామన్నారు. తడిచిన ధాన్యాన్ని సైతం సేకరిస్తున్నామని చెప్పారు.

సన్నవడ్ల సాగును పెంచేందుకు రూ.500 బోనస్ ఇస్తామని, రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందని, గత ప్రభుత్వంలో సన్నబియ్యం పేరుతో వడ్లనే పాలిష్ చేసి అంగన్‌వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించారని ఆరోపించారు. అందుకోసం రాష్ట్రంలో దొడ్డు వడ్లు అమ్ముకోవడం, సన్న వడ్లను కొనుగోలు చేయడం ఎందుకని మనమే మనకు అవసరమైనంత సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్ పథకం ప్రవేశపెట్టామని వెల్లడించారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా బోనస్ పథకం వర్తింపజేస్తామన్నారు.