అయ్యో పాపం
మేడిపల్లిలో ‘అమ్మా’నుషం
౩ నెలల పసిపాప అమ్మకం
కన్నతల్లికి భారమై మరకొరికి బేరం
ఆర్‌ఎంపీ మధ్యవర్తిత్వం
రూ.4.50లక్షలకు విక్రయం
గుట్టురట్టు చేసిన అక్షరజ్యోతి ఫౌండేషన్
నిందితులను అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు
మేడిపల్లి, మే 22 (విజయక్రాంతి): ఆడబిడ్డ పోషణ భారమని ఓ మహిళ తన పేగుబంధాన్ని అమ్మకానికి పెట్టింది. మాతృత్వాన్ని మంటకలుపుతూ డబ్బు కోసం అమ్మ అనే పిలుపును దూరం చేసుకోదల్చింది. తనకు పుట్టిన ఆడబిడ్డను అమ్మేయాలని ఓ మహిళా ఆర్‌ఎంపీని, మరో ఇద్దరిని ఆశ్రయించింది. మూడు నెలల పాపను రూ.4.50లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఈ గుట్టును రట్టు చేయడంతో ఆడబిడ్డను అమ్మకానికి పెట్టిన ముఠాను మేడిపల్లి పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళితే... పోషణ భారంగా భావించి తమ బిడ్డను అమ్మించాలని ఓ బ్రోకర్‌తో పాటు పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో ఓ క్లినిక్ నిర్వహిస్తున్న శోభారాణిని ఆ తల్లిదండ్రులు సంప్రదించారు.
శోభారాణికి అప్పటికే ఆడబిడ్డలను అమ్మినట్లు వారు తెలుసుకున్నారు. అయితే శోభారాణి వ్యవహారంపై అప్పటికే దృష్టి సారించిన ‘అక్షర జ్యోతి ఫౌండేషన్’కు చెందిన కొందరు స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తమకు ఆడపిల్ల కావాలని శోభారాణిని ఆశ్రయించారు. అందుకు ఒప్పుకున్న ఆమె మూడు నెలల ఆడబిడ్డను రూ.4.50లక్షలు ఇస్తే అప్పగిస్తానని ఒప్పందం కుదు ర్చుకుంది. అడ్వాన్సుగా రూ.10వేలు పుచ్చుకున్నందున పాపను తీసుకువస్తే మిగిలిన మొత్తం అప్పగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే శోభారాణికి మధ్యవర్తిత్వం వహించిన బ్రోకర్ ద్వారా ఆ మూడు నెలల పసికందును బుధవారం తన క్లినిక్‌కు తీసుకువచ్చింది. అది గమనించిన తర్వాత పోలీసులకు, మీడియాకు సమాచారం ఇచ్చారు.
దీంతో చిన్నారిని తీసుకువచ్చిన బ్రోకర్ అక్కడి నుంచి పారిపోగా, శోభారాణిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రోకర్ కోసం గాలిస్తున్నారు. అయితే పేద కుటుంబం పిల్లలను పోషించడం భారమని తల్లి చెప్పడంతోనే పిల్లలు లేనివారికి మూడు నెలల పాపను అమ్మించినట్లు శోభారాణి చెప్పింది. అయితే శోభారాణి కొన్ని హాస్పిటల్స్ పేర్లతో పాటు చిలకానగర్‌లోని మరో మహిళా ఆర్‌ఏంపీ, ఓ మ్యారేజ్ బ్యూరోలో పనిచేసే మహిళల పేర్లను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వీళ్లందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఈ చిన్నారిని అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శోభారాణి చెప్పిన ముఠా సభ్యుల కోసం కూడా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.






