21 August, 2026 | 9:36 AM

సీఐపై కేసు నమోదు సబబే

23-05-2024 04:05 AM

అడ్వొకేట్ కమిషన్‌ను అడ్డుకున్న సీఐకి హైకోర్టు షాక్

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషనర్లు పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకే వస్తారని హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం విధులు నిర్వహిస్తున్న అడ్వొకేట్ కమిషనర్లను అడ్డుకున్న సీఐపై మేజిస్ట్రేట్ కోర్టు కేసు నమోదు చేయడాన్ని సమర్థించింది. ప్రభుత్వఉద్యోగిపై నమోదైన కేసు విచారణకు సీఆర్పీసీలోని సెక్షన్ 197 కింద అనుమతి అవసరమని, అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అనుమతి అవసరంలేదని వెల్లడించింది.

2012లో అడ్వొకేట్ కమిషనర్ల విధులకు అడ్డుతగిలారంటూ వరంగల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వరంగల్ జిల్లా హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్‌లో అప్పటి సీఐ వీ సురేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ పూర్తి చేసి పైవిధంగా తీర్పు వెలువరించారు. 2012 డిసెంబరు 21న కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి వస్తున్న సీఎం కాన్వాయ్‌కు అడ్డుపడి రాళ్లు విసరాలన్న కుట్ర నిమిత్తం సమావేశమైన నాటి టీఆర్‌ఎస్ మద్దతుదారులు జోరిక రమేశ్, వాసుదేవరెడ్డి, దర్శన్‌సింగ్, అనిల్, సంకు నరసింగరావు, రాజేంద్రయాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉన్నందున అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది అబ్దుల్ నబీ.. సీజేఎం కోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించిన సీజేఎం న్యాయవాదులు కే రమేశ్, ఎం రవీందర్‌ను అడ్వొకేట్ కమిషనర్లుగా నియమించింది. పోలీస్ స్టేషన్‌లో నిందితులు ఉన్నట్లయితే కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 2012 డిసెంబరు 21న పీఎస్‌కు వెళ్లగా అక్కడ నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, అక్కడ విధుల్లోనే ఉన్న సీఐ సురేశ్, ఇతర పోలీసులు అడ్వొకేట్ కమిషనర్లను అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్లు వరంగల్ కోర్టుకు రిపోర్టు చేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు నిందితులను సీజేఎం కోర్టులో సీఐ హాజరుపరిచారు. కానీ అడ్వొకేట్ కమిషనర్ల రిపోర్ట్ మేరకు సీఐపై సీజేఎం కేసు నమోదు చేశారు. దీనిని సురేశ్ హైకోర్టులో సవాల్ చేశారు.