calender_icon.png 19 January, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిభారం మోయలేం!

19-01-2026 01:46:54 AM

వ్యవసాయ విస్తరణ అధికారులపై వర్క్‌లోడ్

  1. 50 రకాల విధులతో సతమతం
  2. ఒక్కో క్లస్టర్‌కు 5 వేల ఎకరాలు.. ఒక్కరే ఏఈఓ ముందుకుసాగని పంటల వివరాల సేకరణ
  3. పైగా.. పత్తి కొనుగోలు అదనపు బాధ్యతలు 
  4. ఏఈఓలను నియమించి.. పనిభారం తగ్గించాలని సర్కార్‌కు విజ్ఞప్తులు

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ పాలనలో ఏఈఓలపై విపరీతమైన వర్క్‌లోడు పడుతోంది. ఒకవైపు ఐదువేల ఎకరాల సర్వే.. 50 రకాల విధు లు.. మరోవైపు నిర్ణీతగడువు.. ఒక్కరే ఏఈఓ.. వెరసి పనిభారంతో రాష్ట్రంలో పంటల వివరాల సేకరణ ముందుకు సాగడం లేదు. ఊపిరి సలపకుండా విధులు నిర్వర్తిస్తున్నా.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి  వస్తున్న తీవ్ర ఒత్తిడిని భరించలేక.. గడువులోగా వివరాలు సేకరించలేక.. సేకరించినవి యాప్‌లో నమోదు చేయలేక వ్యవసాయ విస్తరణ అధికారులు సతమతమవుతున్నారు.

మరోవైపు ప్రతినెలా మెయింటెన్స్ ఖర్చులు సైతం రాకపోవడం.. ఒక పని పూర్తికాకముందే మరోపని నెత్తిమీద పడడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పీక్కుంటున్నారు. ఈ అర్ధసెంచరీ పనులకు తోడు పత్తికొనుగోలు అదనపు బాధ్యతలు మోపడంతో ఏఈఓలు బెంబేలెత్తుతున్నారు.

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను 2,604 క్లస్టర్‌గా వ్యవసాయ శాఖ విభజించి.. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈఓను నియమించింది. ప్రతి ఏఈఓకు 5 వేల ఎకరాలపైగా (మూడు నుంచి ఐదు గ్రామాలు) అప్పగించింది. ఈ భూములపై సర్వే చేయాల్సి ఉంది. పంటల వివరాలను రబీ, ఖరీఫ్ సమయంలో పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వేల వారీగా రైతు వివరాలను ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారు అనేది యాప్‌లో అప్‌లోడ్‌చేయాలి.

దాని ప్రకారమే ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తుంది. అయితే ఒక్కొక్క ఏఈఓకు ఐదు వేల ఎకరాలకు పైగా సర్వే చేయాల్సి ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 25 మీటర్ల పరిధి నుంచి యాప్‌లో ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉం టుం ది. కొన్ని జిల్లాల్లో ఎత్తున ప్రదేశాలు, కొండ లు, గుట్టల ప్రదేశాలు, వాగులు, వంకలు అవతల, సరైన రోడ్లు లేని భూములకు వెళ్లి సర్వే చేయాల్సి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బై నెంబర్లు ఉన్న భూముల సర్వే విషయంలోనూ రెవెన్యూ శాఖ సహకారం తీసుకోవడంలో కొంత గడువు పడుతుంది.

వేతనాల నుంచి ఖర్చు పెడుతున్నాం..

వ్యవసాయ విస్తరణ అధికారులకు మెయింటెన్స్ ఖర్చులు ప్రతినెలా రూ.9 వేలు ఇస్తామని చెప్పి రెండు.. మూడేళ్ల  క్రితం మూడు నెలల వరకు ఇచ్చింది. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో వేతనం నుంచి ఖర్చ చేయాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఐదువేల ఎకరాలు సర్వే.. 50 రకాల విధులు.. మరోవైపు మెయింటెన్స్ ఖర్చులు సైతం రాకపోవడంతో పడుతున్న ఇబ్బందుల తీరు వర్ణనాతీతంగా ఉందని ఆవేదన వక్తం చేస్తున్నారు. 

ఒక పని పూర్తికాకముం దే మరోపని అప్పగిస్తుండడంతో ఏ పనిచేయాలో తెలియక ఏఈఓలు అయోమయా నికి గురవుతున్నారు. పైగా నిర్ణీత సమయంలో పనిచేయాలని ఆదేశాలిస్తుం డడం తో తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా రైతు భరోసా రాకున్నా.. రుణ మాఫీ కాకుండా రైతులు ఏఈఓలను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిభారం తగ్గించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

5 వేల ఎకరాలకు ఒక క్టస్టర్ ఉండడం వల్ల ఐదారు గ్రామాల్లో పర్యటించాల్సి వస్తుందని, తద్వారా నిర్ణీతగడువు లో పనులు పూర్తి కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఈఓల అదనపు పోస్టులు పెం చడం వల్ల భూమి విస్తీర్ణం తగ్గుతుందని, తద్వారా సర్కార్ నిర్ణయించిన గడువులోగా తమకు అప్పగించిన పనులు పూర్తవుతాయని పాలకులను ఏఈఓలు వేడు కుంటున్నారు.

అధికారుల నుంచీ పెరుగుతున్న ఒత్తిడి..

భూవివరాల నమోదు నిర్ణీత సమయంలో చేయకపోతే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు 50 రకాల పనులలో క్లస్టర్ రీ ఆర్గనైజేషన్, రైతు వేదికల మెయింటనెన్స్ ఖర్చులు, ట్యాబ్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుభరోసా, రైతు బీమా, క్రాప్ బుకింగ్, యూరియా యాప్, క్రాప్ కటింగ్ ఎక్స్పరిమెంట్, పాడి ప్రొక్యూర్ మెంట్, మీ సర్వే, మైక్రో ఇరిగేషన్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ యాప్, ఇతర డిపార్ట్మెంట్ శాఖల విధులు అప్పగిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ఏఈవోలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉన్న విధులతో సత మతమవుతున్న ఏ ఈఓలకు.. మళ్లీ ప్రభు త్వం పత్తి కొనుగోలుకు సంబంధించిన అం శాన్ని అప్పగించింది. కాటన్ మిల్లుల వద్ద పత్తి వివరాలను.. రైతుల వివరాలను నమోదు చేసి సీరియల్ ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ శాఖతో ఏమాత్రం సంబంధం లేదని ఏఈఓలకు ఆ బాధ్యతలను అప్పగించడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది పనిభారం తట్టుకోలేక సెలవులు పెడుతున్నట్లు సమాచారం.