calender_icon.png 19 January, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు

19-01-2026 01:47:48 AM

మా మంత్రులపై తప్పుడు రాతలు రాసి అపోహలు సృష్టించవద్దు!

మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే మీరే చూసుకోవాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): మీడియా అధిపతుల మధ్య గొడవల్లోనికి తమ పార్టీ మంత్రులను, నాయకులను లాగొద్దని, తమపై తప్పుడు రాతలతో శుక్రాచార్యుడు, మారీచ, సుభాహులాంటి ప్రతిపక్ష నాయకులు బలపడేలా చేయడమేనని ఖమ్మం సభలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయని, సింగరేణిలో కొంత కుంభకోణం జరిగిందిని, బొగ్గు  మాయమైందని చెబుతున్నాయని ఇలా రాసే పత్రికలకు, టీవీ ఛానళ్లకు, సోషల్ మీడియా వాళ్లకు, ఇలా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీ నాయకులకు ఒకటే చెపుతున్నానని, తమ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు, అనవసరమైన తప్పుడు ప్రచారాలను కల్పించడం ద్వారా అపోహలను సృష్టించవద్దు సూచించారు.

మీడియా అధిపతుల మధ్య పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని గొడవ పడాలని, లేదా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవాలని, అంతేకానీ అందులోకి తమ పార్టీ నాయకులను లాగటం, ఆంబోతులు కొట్టుకొని లేగ దూడల కాళ్లు విరగ్గొట్టిన చందంగా ఉంటుందన్నారు. వార్తలు రాసే ముందు వాస్తవాలను తెలుసుకొని రాయాలని, వివరణ కోసం తనను అడగలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటలు, 365 రోజులు తాను పని చేస్తున్నానని, మీడియా వారికి వివరణ ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 

తమ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు నాయకుల పైన వచ్చే ఆరోపణలకు పార్టీ నాయకుడిగా తన గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, తన నాయకత్వం పట్ల అపోహను కలిగిస్తుందని, అక్రమా లు అవకతవకల పైన ఎలాంటి రాజీలేదని, ఉండబోదని, కాబట్టి తమ పార్టీ కి చెందిన మంత్రులు నాయకుల పైన ఆరోపణలు ఉన్నాయని కారణంతో వార్తలు రాసేముందు తన నుంచి వివరణ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.