మనల్ని మనమే ఓడించుకున్నాం

29-04-2024 01:40:58 AM

మనల్ని ఎవరూ ఓడించలేదు!

లోక్‌సభ ఎన్నికల్లోనైనా అహాన్ని పక్కపెట్టండి

భేషజాలకు పోవద్దు.. కలిసికట్టుగా పనిచేయండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

కరీంనగర్/రాజన్న సిరిసిల్లా/చొప్పదండి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ‘మనల్ని మన మే ఓడగొట్టుకున్నాం.. మనల్ని ఎవరూ ఓడించలేదు..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి బూత్‌కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్దిగా కష్టపడితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చేదా? కదా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో నైనాఎవరూ భేషజాలకు పోవద్దు.. వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టాలని సూచించారు. ఎవరికి వారు తమను పట్టించుకోవడం లేదని అనుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తేనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల భుజంపై ఆ పార్టీ కండు వా వేసుకుంటే తప్ప ప్రజలు వారిని గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తే వ్యవసాయ మోటార్లకు పక్కాగా మీటర్లు బిగిస్తుందనికేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను రాష్ట్రానికి దక్కకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయన్నా రు. ఐదేళ్లుగా ఎంపీగా బండి సంజయ్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీనే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో బడా భాయ్ మోదీ, తెలంగాణలో చోటా భాయ్ రేవంత్‌రెడ్డి దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.

కేంద్రం సెస్ ద్వారా రాష్ట్రం నుంచి  రూ.30 లక్షల కోట్ల పన్ను వసూలు చేసి, రాష్ట్రానికి మాత్రం పైసా విదిల్చలేదని మండిపడ్డారు. పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బలమైన నాయకత్వం ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. లోక్‌సభ ఎన్నిక ల్లో కష్టపడితే గెలుపు ఖాయమన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్రామాల్లో ఒక్కటైనా నెరవేరడం లేదన్నారు. రాష్ట్ర  వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు ప్రజలకు తెలియ జేయాలన్నారు.

‘గంగుల’ మెజారిటీ తగ్గడానికి మనమే కారణం

‘అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. కానీ ఆయనకు మంచి మెజారిటీ రాకపోవడానికి కారణం మనమే. ఇతర పార్టీలకు చెందిన నేతలు, ఓటర్లు కాదు. ఈవేదికపై కూర్చున్న నేతలే కారణం. మన మధ్య అంతర్గత విభేదాలే కారణం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం బీఆర్‌ఎస్ నాయకులతో నిర్వహించిన నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో 10 నుంచి 12 ఎంపీ స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. తమ పార్టీ ఎంపీల ప్రాతినిధ్యం ఉండాలని, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ కలిసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీల గళం పార్లమెంట్‌లో వినిపించాల్సిందేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్లమెంట్ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులతో పోటీ చేయిస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర ప్రగతి నిలిచిపోయిందన్నారు. 

చొప్పదండిలో రోడ్ షో

బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం చొప్పదండిలో రోడ్‌షో నిర్వహించారు. రేషన్ బియ్యంలో పసుపు కలిపి ఇంటింటికీ అక్షింతలిచ్చి బండి సంజ య్ ‘జై శ్రీరామ్’ అంటున్నారని, ప్రజలకు ఆయన చేసిన మేలేంటో చెప్పడం లేదన్నారు. మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయన్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డివి చిల్లరమాటలు

సీఎం రేవంత్‌రెడ్డివి చిల్లర మాటలు అని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆదివారం నిర్వహించిన వేములవాడ నియోజకవర్గస్థాయి పార్టీ బూత్‌లెవల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చేసే కుట్రను అడ్డుకోవాలంటే పార్లమెంట్‌లో బీఆఆర్‌ఎస్ ఎంపీలు ఉం డాల్సిందేనన్నారు. బీజేపీ శ్రీరాముడు పేరుతో రాజకీయాలు చేస్తున్నదన్నా రు. శ్రీరాముడు అందరివాడన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా తీసుకరాలేదన్నారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని, ఆ విషయంపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నిరుపేదల వివాహానికి కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పిందని, ఆ హామీ ఎప్పుడు అమలవుతుందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉందన్నారు.