17-02-2026 01:11:53 AM
బీఆర్‌ఎస్‌కు గతంలో కంటే 14 శాతం ఓట్లు తగ్గాయి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీల సంబంధం ఏంటో చెప్పాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): తమకు మున్సిపాలిటీలు తక్కువగా వచ్చినప్పటికీ ఓట్ల శాతం, సీట్లు పెరిగాయని, చాలా మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం చూపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కీలకపాత్ర పోషించిందని స్పష్టం చేశారు. 15పైగా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిం దని, 336 స్థానాల్లో తాము గెలిచామని చెప్పారు.
బీఆర్‌ఎస్ పార్టీకి గతంలో కంటే 14 శాతం ఓట్లు తగ్గాయని, బీఆర్‌ఎస్ ఇప్పుడు కేవలం 17 మున్సిపాలిటీలకు పరిమితమైందన్నారు. బీఆర్‌ఎస్‌కి 500 స్థానాలు తగ్గితే బీజేపీకి 100 స్థానాలు గతంకంటే అదనంగా పెరిగాయన్నారు. అధికార పార్టీకి కూడా మెజార్టీ సీట్లు రాలేదని, చరిత్రలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందని, ఈ విషయంలో కేంద్రమంతి బండి సంజయ్‌కి తాను ప్రత్యేక అభినందనలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఖమ్మం, వరంగల్, కొత్తగూడం, పరకాల లాంటి చోట్ల బీజేపీ సత్తా చాటిందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్, నారాయణ పేట, భైంసా మున్సిపాలిటీల్లో బీజేపీ చైర్‌పర్సన్ పీఠం పదవి దక్కించుకుందని తెలిపా రు. భైంసాలో గత కాంగ్రెస్ హయాం నుం చే.. బీజేపీ కార్యకర్తలు, హిందూ ధార్మిక సం స్థల సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు.
అడ్వకేట్‌గా తాను ఎంతో మందికి బెయిల్ ఇప్పించానన్నారు. ఇంతకాలం బీఆర్‌ఎస్ మజ్లిస్, కాంగ్రెస్ మజ్లిస్ కలిసి.. భైంసాలో బీజేపీని రానివ్వలేదని, భైంసాలో ఎంఐఎం పార్టీ ఎన్నో ఆగడాలకు పాల్పడిందని ఆరోపించారు. నిజామాబాద్‌లో 28 చోట్ల బీజేపీ గెలిచి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. మజ్లిస్ పార్టీ ఓటు పర్సంటేజీ.. తగ్గినా.. వారి ప్రభావం రాష్ర్టం లో పెరుగుతున్నదన్నారు.
నిర్మల్‌లో ఒక వార్డులో ఎప్పుడూ లేనంతగా మైనార్టీ ఓట్లు పెరిగాయని, దీనిమీద తమకు అనుమానం ఉన్నదని, ఫిర్యాదు చేశామన్నారు. 20 శాతం నుంచి 57 శాతానికి మైనార్టీ ఓట్లు ఎలా పెరిగాయి? బీజేపీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి.. బీజేపీకి మేయర్, చైర్‌పర్సన్ పదవులు రానివ్వకుండా కుట్ర చేశాయని విమర్శించారు.
ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలైన ఈ మూడు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎర్రజెండా ఎక్కడా లేకున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ ఎర్రజెండాకు అధికారం వచ్చేలా చేస్తున్నదని, బీజేపీ ఎప్పుడూ అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్నారు. ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్ రాబోతున్నదని, హైదరాబా ద్‌లో దొంగ ఓట్లు, బయటి ఓట్లు తీసేయబోతున్నామని, ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండా లన్నారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఒక్కో ఇంటిపై 60 ఓట్ల వరకు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. క్రాస్ ఓట్ల లెక్కలపై చర్యలు తప్పవని పార్టీ అభ్యర్థులకు ఆయన హెచ్చరించారు. విప్ జారీ చేశాక కూడా క్రాస్ ఓట్లు అవ్వడంపై కచ్చితంగా చర్యలుంటాయన్నారు.
మెట్‌పల్లిలో విప్ జారీచేశామని, అక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగిందని, ఈ అంశంపై కూడా సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. తమకు ఓటు వేసిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు.