calender_icon.png 20 January, 2026 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పిస్తాం

20-01-2026 12:05:24 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

రేగొండ, జనవరి 19 (విజయక్రాంతి): ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఆర్టీసీ ప్రజల ఆస్తి అని, ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.రేగొండ మండల కేంద్రంలో రూ.3 కోట్ల 70 లక్షలతో నిర్మించే ఆర్టీసీ బస్టాండ్ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ పేదల సంస్థ అని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న మూడేళ్లలో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

రేగొండలో బస్టాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఇది ప్రజల చిరకాల వాంఛ అని,ఈ బస్టాండ్ ద్వారా చుట్టుపక్కల మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు.రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పిడి రాజేశ్వరి, ఎంపీడీవో తరుణ్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.