హక్కుల రక్షణకు కలిసి రావాలి
- ఏఐఎస్‌ఎఫ్ నూతన అధ్యక్షుడిగా పుట్ట లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక
- ఉత్తరప్రదేశ్ బారాబంకిలో ఘనంగా 90వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు
- విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): దేశంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించడానికి, విద్యార్థి వేతనాల (స్కాలర్‌షిప్‌లు) సాధనకు, రాజ్యాంగ బద్ధమైన హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని నూతనంగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గురువారం ఉత్తరప్రదేశ్ బారాబంకిలో జరిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) 90వ వార్షికోత్సవ ముగింపు వేడుకలలో భాగంగా పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో ప్రైవేటీకరణను నిరోధించడానికి రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని, దేశవ్యాప్తంగా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు.
విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న చారిత్రాత్మక సంఘమైన ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షునిగా తనను ఎన్నుకున్నందుకు జాతీయ నాయకత్వానికి, మద్దతుగా నిలిచిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఏఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు, జాతీయ నాయకులు పాల్గొన్నారు.






