14 August, 2026 | 2:55 AM

వజ్రా రైస్ మిల్లును అప్పగించేందుకు సిద్ధం

14-08-2026 01:29 AM
  1. ఒక్కసారి నోటీసు తీసుకోకున్న కక్ష్యసాధింపు చర్యలు
  2. కుటుంబ సభ్యులపైన కేసు నమోదుపై ఆగ్రహం
  3. నిపుణులతో చర్చకు తాను సిద్ధం
  4. యాజమాని వట్టె జానయ్య యాదవ్ ఆవేదన

సూర్యాపేట, ఆగస్టు 13 (విజయక్రాంతి): మహిళా సంఘాలకు రైస్ మిల్లులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, అవసరమైతే తన వజ్రా రైస్ మిల్లును కూడా మహిళా సంఘాలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని వజ్రా రైస్ మిల్ నిర్వాహకులు వట్టె జానయ్య యాదవ్ ప్రకటించారు. సూర్యాపేటలోని వజ్రా రైస్ మిల్లు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ మిల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎంఆర్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా నోటీసు తీసుకునే పరిస్థితి రాకుండానే చెల్లింపులు పూర్తి చేస్తూ వచ్చామన్నారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లోనైన అధికారులు తమ మిల్లును లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు. రైస్ మిల్లుల వ్యవహారంలో వర్తించాల్సిన చట్టపరమైన నిబంధనలకు భిన్నంగా అనేక క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు.

ప్రభుత్వంతో సీఎంఆర్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్న వ్యక్తులపైనే చట్టపరమైన బాధ్యత ఉంటుందని, ఏదైనా ఉల్లంఘన జరిగితే నిబంధనల ప్రకారం వారిపైనే చర్యలు తీసుకోవాలని కానీ అధికారులు కుటుంబ సభ్యులను కేసుల్లో చేర్చారని ఆరోపించారు. ఎంబీబీఎస్ చదువుతున్న తన చిన్నకుమారుడిని సైతం అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లుల్లో విస్తవంగా ఎంత బియ్యం వస్తున్నాయో పరిశీలించాలన్నారు.

మిల్లింగ్ చేసే, ప్రభుత్వం నిర్దేశించే వాటి మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. క్వింటాకు 67 కేజీల బియ్యం ఇవ్వాలనే నిబంధన సరికాదన్నారు. తన వాదన తప్పు కాదని, ప్రభు త్వం, అధికారులు, నిపుణులు, ఎవరి సమక్షంలోనైనా చర్చకు తాను సిద్ధమన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసంతో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందానని తెలిపారు. చట్టప్రకారం వ్యాపారం చేస్తున్నానన్నారు. రాజకీయ కక్ష్యలతో తమను వేదించడం తగదని జానయ్య మండిపడ్డారు.