calender_icon.png 8 November, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియంతలు గద్దె దిగాల్సిందే

08-11-2025 07:56:07 PM

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి..

​సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య..

​నకిరేకల్ (విజయక్రాంతి): కార్మికవర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైన గద్దె దిగాల్సిందేనని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో  ఉత్సహపూరితంగా సీఐటీయూ జిల్లా నాలుగో మహాసభలు జరిగాయి. మహాసభల ప్రారంభ సూచికంగా జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. నాయకత్వం, ప్రతినిధులు అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రపంచాన్ని ఆయుధ సంపత్తితో శాసిస్తున్న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్మికుల పక్షపాతి జోహ్రన్ మాందనీ విజయం, ఇటీవల శ్రీలంక ఎన్నికల్లో దిస నాయకే విజయం పెట్టుబడిదారులకు చెంపపెట్టు లాంటిదని అభివర్ణించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని, దేశాన్ని అదానీ-అంబానీలకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. న్యూయార్క్, శ్రీలంక స్ఫూర్తితో కార్మిక వర్గం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన అన్నారు.

​కాంగ్రెస్, బీజేపీ విధానాల్లో తేడా లేదు.​ ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పనిగంటల పని విధానాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని విమర్శించారు. కార్మికుల విషయంలో బీజేపీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ​అనంతరం జిల్లా మహాసభలో జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచరణకు పలు తీర్మానాలను చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గొరిగే సోములు, ఎండీ. పాషా, చిలువేరు రమా కుమారి, దోనూరి నర్సిరెడ్డి, తుర్కపల్లి సురేందర్, బొడ్డుపల్లి వెంకటేశం, సుబ్బురు సత్యనారాయణ, పైళ్ళ గణపతి రెడ్డి, మాయ కృష్ణ, నకిరేకంటి రాము, ఆడిమూలం నందిశ్వర్, స్వప్న, కోట సంధ్యా రాణి, బందెల బిక్షం, అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.