5 August, 2026 | 3:39 AM

మత్తు బారిన పడకుండా యువతను కాపాడుకోవాలి

05-08-2026 01:44 AM

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) కమిటీ సమావేశంలో మాట్లాడారు.  జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గంజాయి వంటి మత్తు పంటల అక్రమ సాగు గుర్తించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు, ఎక్సైజ్, విద్య, వైద్య శాఖలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా కీలకమన్నారు. యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.