8 April, 2026 | 4:12 AM

జవహర్‌నగర్ బాలల సంక్షేమానికి సమన్వయంతో పనిచేయాలి

08-04-2026 12:38 AM

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): జవహర్ నగర్ లో ని బాలల సంక్షేమానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి చైర్ పర్సన్ సీత దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్  సభ్యులు చందన, సరిత హాజరైనారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడతూ జవహార్ నగర్ లోని పిల్లలను కాపాడడమే కాకుండా వారికి అవసర మైన మౌళిక సదుపాయాలైన విద్యా, వైద్యం  అందించి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు. దీని కోసం  జిల్లాయంత్రాంగం మొత్తం కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు.

అక్కడ ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకోని ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్దామన్నారు. బాలల హక్కులరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో  ముందుకు వెళితే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతామన్నరు.  అక్కడి పిల్లలకు కనీసం ఆధార్,  బర్త్, కాస్ట్ సర్టిఫికేట్ లు లేని వారు చాలా మంది ఉన్నారని, వారికోసం అక్కడే ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అందించాలని కీసర ఆర్డిఓను కోరారు.

బాల కార్మికులు, బాల్య వివాహాలు, చైల్ సెక్సువల్ అబ్యూస్, డ్రాపౌట్  వంటి అనేక సమస్యలు అక్కడ ఉన్నాయని జిల్లాయంత్రాంగం సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్దతో ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. అందుకుగాను  ఏ విధంగా ముందుకువెళితే సమస్యలను పరిష్కరించగలమో అధికారులు వారి వారి అభిప్రాయాలను సలహాలను తెలియజేయాలన్నారు.  చైల్ లేబర్ చాలా మంది ఉన్నారని లేబర్ డిపార్ట్ మెంట్ వారిని గుర్తించి వివరాలు అందించాలని ఆదేశించారు.

ఆపరేషన్ ముస్కాన్ తరహాలో ఇప్పుడు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి చైల్ లేబర్ ను గుర్తించాలన్నారు. అవసరమైతే సంబంధిత అధికారులకు, ఉన్నతాధికారుల దృష్టికి ఈసమస్యలను తీసుకువెళ్లి వారి సహాయ సహాకారాన్ని తీసుకొని సమస్యను పరిష్కరిద్దామన్నారు.

జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక కార్యచరణ  రూపొందించుకొని ప్రణాళికబద్దంగా  ప్రాధాన్యతను బట్టి ఆయా ప్రాంతాలలోని పిల్లలకు  కావలసిన సదుపాయాలను అందిస్తూ ఆ వాతావరణం నుండి బయటకు తీసుకురావడానికి కావలసిన చర్యలను అన్ని శాఖలు, ఎన్జీఓల  సమన్వయ సహాకారంతో  నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.

ఈ ఏప్రిల్ నెలలో అంగన్వాడీల ద్వారా ఫ్యామిలీ సర్వే జరుగుతుంది కాబట్టి, ఆ డేటాను కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడడమే కాకుండా వారి సామాజిక-ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి  దోహదపడుతుందన్నారు.ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహాణలో భాగంగా విద్యా, వైద్య, లేబర్, మహిళ శిశు సంక్షేమ, బిసి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, పోలీసు, ఎక్సైజ్, పరిశ్రమలు,రెవెన్యూ, డిఆర్డిఓ, డ్రగ్ కంట్రోల్ తదితర శాఖల కార్యాచరణ ప్రణాళికలను అడిగి తెలుసుకొని, కావలసిన సలహాలను సూచనలను అందించారు.