calender_icon.png 4 July, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌తోనే మాకు లెక్క కేటీఆర్, హరీశ్‌పై మాట్లాడను!

04-07-2025 01:51:08 AM

  1. కేసీఆర్ అసెంబ్లీకు వస్తే బనకచర్లపై చర్చిద్దాం
  2. ట్రిపుల్ ఆర్‌పై ప్రధాని, గడ్కరీని త్వరలో కలుస్తాం
  3. హ్యామ్ మోడల్‌లో రోడ్లను నిర్మిస్తాం
  4. మూడేండ్లలో ట్రిపుల్ ఆర్ పూర్తి  
  5. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): కేటీఆర్, హరీశ్‌రావుపై తాను మాట్లాడబోనని, కేసీఆర్‌తోనే తనకు లెక్క అని  ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హరీశ్ జస్ట్ ఓ ఎమ్మెల్యే మాత్రమేనని.. తాను మంత్రినని ఆయనపై తాను మాట్లాడనని, అయితే కేసీఆర్‌పైన మాట్లాడుతానని మంత్రి స్పష్టం చేశారు. హరీశ్‌రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని, ఆ పదవి తెచ్చుకుంటే అసెంబ్లీలో మాట్లాడుదామని మంత్రి సవాల్ విసిరారు.

కేసీఆర్ అసెంబ్లీకు వస్తే బనకచర్లపై చర్చిద్దామని, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కేసీఆర్ రావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సలహాలు ఇస్తే తీసుకుంటామన్నారు. రాష్ర్టంలోని రోడ్లు, ట్రాఫిక్ సమస్యపై గురువారం  ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో అధికారులతో మంత్రి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) విషయంలో త్వరలోనే పీఎం మోదీని, కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తామని తెలిపారు. మూడేండ్లలో ట్రిపుల్ ఆర్‌ను పూర్తి చేస్తామన్నారు. ఆరులైన్ల రోడ్డు కోసం త్వరలో క్యాబినెట్ అమోదం లభిస్తుందని, టెండర్ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ ఆర్ కోసం 96 శాతం ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిందన్నారు. 

హ్యామ్ మోడల్‌లో రోడ్లు

రాష్ర్టంలో ట్రాఫిక్ రద్దీ ఉన్న రోడ్లను గుర్తించి ప్రాధాన్య క్రమంలో హ్యామ్ మోడల్‌లో రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సీఎంతో చర్చించి 15 ప్యాకేజీల వరకు పనులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. 40:60 శాతం ప్రకారం హ్యామ్ రోడ్లు ఎన్‌హెచ్‌ఏ మోడల్‌లో అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. హ్యామ్ రోడ్లపై టోల్ వసూలు చేయబోమని, రాష్ట్రంలో కేవలం రెండు మార్గాల్లో  మాత్రమే టోల్ ప్రపోజల్ ఉందన్నారు.

హ్యామ్ రోడ్ల అంశంపై సీఎం సమావేశంలో సలహా తీసుకొని త్వరలో టెండర్స్ పిలుస్తామన్నారు. రాష్ర్టవ్యాప్తంగా రోడ్ల కోసం ఇప్పటికే రూ. 6,500 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రూ. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. సింగిల్ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వచ్చే ఎన్నికల నాటికి పూర్తి

వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ రోడ్లు, హ్యామ్ రోడ్లను పూర్తి చేసి దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతామని  మంత్రి స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయన్నారు. విజయవాడతోపాటు మరికొన్ని మార్గాల్లో ఆక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌ను గుర్తించి పనులు చేపడుతున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో పెండింగ్ ప్రమోషన్స్, పోస్టింగ్స్ ఇచ్చామని చెప్పారు. రూరల్ రోడ్లను రానున్న మూడు ఏండ్లలో పూర్తిచేస్తామన్నారు. 

పెండిగ్ బిల్లులు చెల్లిస్తాం

 చిన్న కాంట్రాక్టర్ల పెండిగ్ బిల్లులను ఈనెలలో చెల్లిస్తామని, ప్రతి నెలా పాత బకాయిలు చెల్లిస్తామన్నారు.  కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ. 3,400 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయారని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లులో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు.