calender_icon.png 4 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలాలు పొంగొద్దు.. వరద ముంచెత్తొద్దు

04-07-2025 01:50:44 AM

  1. ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారానికి చర్యలు
  2. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 3 (విజయక్రాంతి): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో నాలాలు పొంగి, వరదలు ముంచెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వే షించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. నాలాలకు ఉన్న ఆటంకాలన్నీ తొలిగితే చాలా వరకు ముంపు సమస్య తలెత్తదని ఆయన గురువారం నగరంలోని పలు ప్రధాన నాలాలు, వరద ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ భారీ వర్షాలు పడినప్పుడు మూసీనదీ పరీవాహకం కంటే కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాలే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు.. ఈ రెండు నాలాలు సాఫీగా సాగకపోవడంతో భరత్‌నగర్, మూసాపేట, బాలానగర్, జింకలవాడ, దీన్‌దయాళ్‌నగర్, వినాయక్‌నగర్, కల్యాణ్ నగర్ వంటి ప్రాంతాలు ఏటా నీట మునుగుతున్నాయని, ఈ ఏడాది అలాంటి ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రంగనాథ్ గుర్తుచేశారు.

జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ నుంచి వచ్చే వరద కాలువ ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై కుంచించుకుపోయి న విషయాన్ని కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ఫాక్స్ సాగర్ అలుగు కాలు వ ఆనవాళ్లే లేకుండా పోయిందని, జీడిమెట్ల ప్రాంతంలో ఆ కాలువ 30 మీటర్ల వెడల్పుతో ఉంటే, కల్వర్టుల వద్ద వెడల్పు కాలనీలు, బస్తీలకు వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోయిందని గుర్తిం చారు.

జీడిమెట్ల నాలా పొడుగునా ఫతేనగర్, బాలానగర్ బస్తీలన్నీ నీట మునుగుతున్నాయని గుర్తించారు. వెంటనే జీడిమెట్ల నుంచి వచ్చే ఈ నాలాను డ్రోన్ కెమెరాతో పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అల్వాల్ మండలం యాప్రాల్‌లోని నాగిరెడ్డి కుంట కబ్జాలను కూడా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 6 ఎకరాల వరకు కబ్జా కు గురైందని గుర్తించారు.

చెరువులో పోసిన మట్టిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగిరెడ్డి కుంట నుంచి కాప్రా చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువలు ఎక్కడికక్కడ దారితప్పడంతో పాటు, కబ్జాలకు గురి కావడాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. కొన్ని చోట్ల నాలాలకు ఏర్పడిన ఆటంకా లను తనిఖీ చేశారు. గోల్ఫ్ ప్రైడ్ హోమ్స్, మల్బార్ గీన్స్ విల్లాస్, హరిప్రియానగర్, గోల్ఫ్ వ్యూ ప్యారడైజ్, స్వర్ణాంధ్ర ఫేజ్ 01, 02 వంటి పలు గేటెడ్ కమ్యూనిటీలలో వాగులు రూటు మారడాన్ని, కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడడాన్ని కమిషనర్ గమనించారు.

నాలా ఆరంభంలో ఎంత వెడల్పులో ఉందో, కాప్రా చెరువులో కలిసే వరకు అదే కొనసాగేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. ఇక్కడి వివిధ కాలనీ వాసులతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేసి, గతంలో నాలాలు ఏ మార్గంలో వెళ్లేవి, ఇప్పుడు వాటిని పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు.