calender_icon.png 4 December, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో ‘రెవెన్యూ’ను పునర్నిర్మించాం

04-12-2025 12:30:54 AM

  1. మూడుశాఖల్లో సమూల మార్పులు
  2. హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలో రెండేళ్లలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని, ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్‌ను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. 2.29 కోట్ల సర్వే నెంబర్లకు భూధార్ నెంబర్ కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రాష్ర్టంలో నక్షాలు లేని 413 గ్రామాల్లో సరిహద్దుల, భూధార్ నెంబర్ల కేటాయింపు వంటి ప్రధాన అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి పని పూర్తి చేశామని, ఈ ఐదు గ్రామాలకు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన 408 గ్రామాల్లో పట్టణ ప్రాంతాలు మినహా 373 గ్రామాల్లో రెండవ విడత కింద సర్వే నిర్వహిస్తామన్నారు. మూడవ విడతగా అన్నిజిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తామని తెలిపారు.

రాష్ర్టంలో ఇంతవరకు భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తామని, ఆ తర్వాత ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. డిసెంబర్ నెల నుంచి మరో మూడు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అందుబాటు లోకి రానున్నాయని చెప్పారు. హిల్ట్ పాలసీపై స్పందిస్తూ బీఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి-తో వ్యవహరిస్తోందన్నారు.

నోరుంద ని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని, ఆనాడు ప్రభుత్వంలో ఎంఏయూడీ మంత్రిగా ఆయనకు నచ్చిన వారికి ముడుపులు చెల్లించిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారని ఆరోపించారు. కానీ మేం అలా చేయలేదని, పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశామని తెలిపారు. ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టాను విప్పుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.