calender_icon.png 4 December, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకుల కృషి.. సర్పంచులుగా తల్లులు!

04-12-2025 12:28:40 AM

మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మహిళల ఏకగ్రీవం

మహబూబాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాజకీయంగా పేరు గడించిన కొడుకు లు తమకు జన్మనిచ్చిన తల్లులను గ్రామ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా గ్రామస్థులను ఒప్పించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదళ్ల యాదవరెడ్డి ఉన్నారు. తమ గ్రామం పార్వతమ్మగూడెం సర్పంచి పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో తల్లి పూలమ్మను సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి కృషి చేశాడు.

తాను తల్లితో వెన్నంటి ఉండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులంతా పూలమ్మను సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. పూలమ్మకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం విశేషం.

నాడు పరాజయం.. నేడు ఏకగ్రీవం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో 2019 సర్పంచు ఎన్నికల్లో పోటీ చేసిన ధరావత్ కైక పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కైక కుమారుడు రవి నారాయణపురం ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన తల్లి కైకను ఈసారి ఎన్నికల్లో సర్పంచుగా గెలిపించాలని కంకణం కట్టుకున్నాడు.

ఆ మేరకు క్యాంపు తండా సర్పంచు పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయించగా తన తల్లి కైకను అభ్యర్థిగా నిలిపాడు. 8 మంది సర్పంచు పదవికి నామినేషన్ వేసినప్పటికీ వారందరినీ ఒప్పించి చివరికి తల్లి కైకను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రవి కృషి చేశాడు. ప్రత్యర్థులంతా పోటీ నుంచి వైదొలగడంతో బుధవారం కైక ఏకగ్రీవంగా గ్రామ సర్పంచుగా ఎన్నికయింది.