calender_icon.png 29 July, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు అతీతంగా ఢిల్లీకి రావాలి

29-07-2025 01:56:09 AM

  1. రిజర్వేషన్లు సాధించుకోవడానికి జేఏసీగా ఏర్పడి పోరాడాలి 
  2. బీసీ బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేస్తాం 
  3.   34 శాతం ఉన్న రిజర్వేషన్లను బీఆర్‌ఎస్ సర్కారే తగ్గించింది 
  4. బీసీ బిల్లుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ బీసీ నేతలు సహకరించాలి 
  5. క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): బీసీలకు సంబంధించి 42 శాతం రిజర్వేషన్లు కాపాడుకోవడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని కుల, బీసీ సంఘాలు, బీసీ మేధావులపై ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో, విద్యా ఉపాధి, అవకాశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉం దని తెలిపారు.

ఆగస్ట్ 5,6,7  తేదీల్లో  సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు కలిసి రాష్ర్టపతి అపాయింట్‌మెంట్ అడుగుతున్నామని చెప్పారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి మం త్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు ఉంటే అప్ప టి సీఎం కేసీఆర్ తగ్గించారని విమర్శించారు.

2018 పంచాయతీరాజ్  చట్టాన్ని సవరించి 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపామని, గవర్నర్ నుంచి సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.   ‘ఆగస్టు 5,6,7 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ కూ టమి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్తున్నాం.

తెలంగాణలోని ప్రతీ బీసీ బిడ్డ ఢిల్లీ రావాలి బీసీ, మేధావులు కులసంఘాలు అన్ని పార్టీల నాయకులు ఢిల్లీ వచ్చి బీసీల 42శాతం రిజర్వేషన్లు తెచ్చుకుందాం. గతంలో మా ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4, 2024లో తీసుకున్న నిర్ణయం మేరకు కులగణన సర్వే జరిపించాం. ఆ నివేదికను సబ్‌కమిటీ ద్వారా పరిశీలన చేసి ఫిబ్రవరి 4, 2025న క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించాం.

మార్చి 17న అన్ని పార్టీల సహకా రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యఉపాధి అవకాశాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులు శాసనసభ ఆమోదించి మార్చి 22న గవర్నర్‌కు పంపాం. గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుని మార్చి 30న రాష్ర్టపతి ఆమోదం కోసం పంపించారు. ఇప్పుడు ఆ రెండు బిల్లులు బిల్లులు రాష్ర్టపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. 

కేంద్రం నుంచి నిధులు రావడం లేదు.. 

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు పంచాయతీ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావా ల్సిన నిధులు కూడా రావడం లేదని మంత్రి పొన్నం తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని రాష్ర్టపతి దగ్గర ఉన్న బిల్లులు ఆమోదింపజేయాలన్నారు.

బీజేపీలో ఉన్న బీసీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య , లక్ష్మణ్ కూడా బీసీ బిల్లు ఆమోదం పొం దేలా సహకరించాలన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ముందుకు రావాలని చేతులెత్తి దండం పెడుతున్నామన్నారు. అయితే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు.. 

శాసనసభలో నిజాయితీగా బిల్లులకు మద్దతు తెలిపారని, ఇప్పుడు మోకాలడ్డుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకొని అడ్డు కునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని, తెలంగాణలో ఉన్న బీసీ మేధావులు, నాయకులు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం జేఏసీగా ఏర్పడి పోరాడినట్లే ఇప్పుడు పోరాడాలన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని, రాహుల్‌గాంధీ ఇచ్చిన హా మీని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘ఎంపైరికల్ డేటా ఉం టే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఉంది. ఈ విష యం హైకోర్టు న్యాయవాది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రాంచందర్‌రావుకు తెలియ దా..?  కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు పారదర్శకంగా అమలు చేస్తున్నాం.

ఒక  శాతం కూ డా మా చిత్తశుద్ధిని శంకించకుండా చేశాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తర్వాత 50 శాతం పరిమితి తొలగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కలిపి 65 శాతం రిజర్వేషన్లు అమ లవుతున్నాయి. పరిమితి ఓసారి తొలగిన తర్వాత ఇంకా ఇబ్బందులేంటీ..? సాంకేతికంగా సలహాలు సూచనలు ఉంటే మీ దగ్గరి కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలని ఆశ తప్ప ఇంకేమి లేదు. మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ’ అని మంత్రి పేర్కొన్నారు.